మత్తులో నడిపి... ప్రాణాన్ని బలిగొని..

మద్యం మత్తులో ట్రక్కు డ్రైవర్‌ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన దోమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తిమ్మాయిపల్లి సమీపాన శనివారం చోటు చేసుకుంది.

Updated : 26 Jun 2022 04:58 IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ట్రాలీఆటో

బాలుడి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

పరిగి, దోమ, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ట్రక్కు డ్రైవర్‌ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన దోమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తిమ్మాయిపల్లి సమీపాన శనివారం చోటు చేసుకుంది. ఎస్‌.ఐ. విశ్వజన్‌ తెలిపిన వివరాలు. దోమ మండలంలోని ఊటుపల్లికి చెందిన సాయికుమార్‌ (17) ఇటీవల ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడు. ఇదే గ్రామానికి చెందిన కావలి సందీప్‌ (13) దోమలో 9వ తరగతి చదువుతుండగా, పరిగికి చెందిన మల్లేష్‌ (28) కూలీ. వీరు ముగ్గురు కలిసి బైక్‌పై దోమకు బయల్దేరి వెళ్తున్నారు. దారిలో తిమ్మాయిపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొంది. దీంతో సాయికుమార్‌ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సందీప్‌ కాలు, చేయి విరిగిపోగా, మల్లేష్‌కు కూడా తలకు బలమైన గాయంతో పాటు కుడికాలు విరిగింది. పరిగిలోని సామాజిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి నగరంలోని ఉస్మానియాకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగికి తరలించారు. ట్రాలీ ఆటో డ్రైవర్‌ వి.శేఖర్‌ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఎస్‌ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించిన సాయికుమార్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి రాములు ఎనిమిదేళ్ల క్రితమే విద్యుదాఘాతంతో చనిపోయాడు. తల్లి చంద్రకళ కులవృత్తితో పాటు కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ః ప్రమాదంలో గాయపడ్డ మిగతా ఇద్దరు కూడా తల్లిదండ్రులకూ ఒక్కరే కుమారుడు. పరిగికి చెందిన మల్లేష్‌కు వివాహం అయ్యింది. అతడికి భార్య ఇద్దరు పిల్లలు సంతానం. కూలీ చేస్తూ జీవనం సాగించే వాడు. ఊటుపల్లిలో ఉంటున్న తన మేనమామ వద్దకు వారం రోజుల క్రితం వెళ్లాడు. బైకు ఎవరిది? వీరు దోమకు ఎందుకు వెళుతున్నారు? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో డ్రైవర్‌ ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని