బ్యాంకు మిత్ర బ్యాగు లాక్కుపోయిన దుండగులు

బ్యాంకు మిత్రను మురుగు బోదెలో తోసేసి అతని వద్ద నుంచి నగదు బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని పారిపోయిన సంఘటన తమిరిశలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బ్యాంకు మిత్ర, గ్రామస్థులు తెలిపిన వివరాల

Updated : 01 Jul 2022 05:57 IST

రూ. 2లక్షల వరకు నగదు ఉందంటున్న బాధితుడు

దుర్గారావు వద్ద గుమిగూడిన గ్రామస్థులు

తమిరిశ (నందివాడ), న్యూస్‌టుడే: బ్యాంకు మిత్రను మురుగు బోదెలో తోసేసి అతని వద్ద నుంచి నగదు బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని పారిపోయిన సంఘటన తమిరిశలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బ్యాంకు మిత్ర, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు నగదు చెల్లింపులు, వసూళ్ల కోసం మిత్ర దుర్గారావు టీవీఎస్‌ మోపెడ్‌పై గురువారం రాత్రి తమిరిశకు వచ్చాడు. ఉన్నత పాఠశాల పక్కరోడ్డులో ఉండగా కూరగాయలు కావాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అడగటంతో తను బ్యాంకు మిత్రను అని చెప్పానని, అంతలోనే పక్కనే ఉన్న మురుగు డ్రెయిన్‌లో తోసేసి తన వద్ద ఉన్న నగదు బ్యాగును లాక్కొని పారిపోయినట్లు అతడు చెబుతున్నాడు. తాను తేరుకుని కేకలు వేయగా చుట్టుపక్కల వారు గుమిగూడి విషయంపై ఆరాతీశారన్నాడు. ప్రస్తుతం ఖాతాల్లో అమ్మఒడి నగదు పడటంతో లబ్ధిదారులు నగదు డ్రాచేసుకునేందుకు ఫోన్లు చేయగా వచ్చానని, బ్యాగులో సుమారు రూ. 2లక్షల వరకు నగదు ఉన్నట్లు మిత్ర తెలిపాడు. సర్పంచి భర్త సొలోమాను, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని మిత్ర ద్వారా ఫోన్‌లో పోలీసులకు తెలియజేశారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని నందివాడ పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా కొంత కాలంగా గ్రామంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. చీకటి పడితే ఉన్నత పాఠశాల చుట్టూ కుర్రకారు చేరి, మందు, విందులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాని గ్రామస్థులు చెబుతున్నారు. నిత్యం జనసంచారం ఉండే ఈ రోడ్డులో ఇలాంటి చర్యకు పాల్పడటంపై గ్రామస్థులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని