చంపేశారు..!

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. అతి కిరాతకంగా ప్రాణాలు తీసేశాడు.. అడ్డుకోవాల్సిన అత్తమామలు ఇందుకు తోడయ్యారు.. కన్నపిల్లల ఎదుటే ఈ దారుణం జరిగితే రోదించడం తప్ప వారేమీ చేయలేకపోయారు.. కంచిలి మండలం  పద్మతుల గ్రామంలో శుక్రవారం

Updated : 02 Jul 2022 06:40 IST

వివాహితపై భర్త, అత్తమామల మూకుమ్మడి దాడి, హత్య

పద్మతులలో ఘటన

న్యూస్‌టుడే, కంచిలి

పుష్ప మృతదేహం

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. అతి కిరాతకంగా ప్రాణాలు తీసేశాడు.. అడ్డుకోవాల్సిన అత్తమామలు ఇందుకు తోడయ్యారు.. కన్నపిల్లల ఎదుటే ఈ దారుణం జరిగితే రోదించడం తప్ప వారేమీ చేయలేకపోయారు.. కంచిలి మండలం  పద్మతుల గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంపురం పంచాయతీ పద్మతుల గ్రామానికి చెందిన పిట్ట శ్రీనుకు పుష్ప(30)తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, బాబు ఉన్నారు. శ్రీను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని అనుమానంతో ఏడాది కిందటే ఆమెపై దాడి చేశాడు. దీంతో కేసు కంచిలి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లి ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. 

కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు గ్రామంలోనే వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. ఇటీవల శ్రీను సెలవుపై గ్రామానికి వచ్చాడు. అదే సమయంలో పుష్ప తన కన్నవారి ఊరు ఇచ్ఛాపురంలో గ్రామదేవత సంబరాలకు పిల్లలతో పాటు పిన్ని ఇంటికెళ్లింది. వారం రోజుల తర్వాత తిరిగి శుక్రవారం పద్మతుల వచ్చింది. ఆమె ఇంటికొచ్చేసరికి భర్త ఆమె ఉంటున్న ఇంటి తాళాలు పగులగొట్టి వేరే తాళాలు వేసుకొని అతని తల్లిదండ్రులు నూకయ్య, సాయమ్మ వద్దకు వెళ్లాడు. తాళాలు వేసి ఉండటాన్ని గుర్తించి పుష్ప వాటిని విరగ్గొట్టి ఇంటిని శుభ్రపరిచింది. సాయంత్రం ముగ్గురు పిల్లల్ని ఇంటికి పిలిచేందుకు భర్త ఇంటికి వెళ్లగా మామ నూకయ్య దురుసుగా ‘నీకు పిల్లలు కావాలా’ అంటూ ఆమెపై దాడికి దిగాడు. అత్త సాయమ్మ, అతనూ కలిసి రోడ్డుపైకి నెట్టేశారు. నూకయ్య, శ్రీను ఇద్దరూ ఆమె పీకనులిమారు. దీంతో ఆమె మృతిచెందింది. కోడలిని చంపేయమంటూ సాయమ్మ ప్రోత్సహించినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి పెద్ద కుమార్తె, ఆమె బంధువు బొచ్చు దాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌ఛార్జి ఎస్‌.ఐ. నారాయణస్వామి తెలిపారు. సోంపేట సీఐ రవిప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని