కొమరగిరిపట్నంలో ఘోర విషాదం

మండలంలోని కొమరగరిపట్నంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటికి నిప్పు అంటుకుని మంటలు వ్యాపించడంతో తల్లీకుమార్తె కాలిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..

Updated : 03 Jul 2022 06:15 IST

కాలిబూడిదైన తాటాకు ఇల్లు.. నిద్రిస్తున్న గర్భిణి, ఆమె తల్లి మృతి


ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం

అల్లవరం, న్యూస్‌టుడే: మండలంలోని కొమరగరిపట్నంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటికి నిప్పు అంటుకుని మంటలు వ్యాపించడంతో తల్లీకుమార్తె కాలిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక ఆకులవారివీధిలో ఉంటున్న సాధనాల లింగన్న, మంగాదేవికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కుమార్తె మమతకు రెండేళ్ల క్రితం పెళ్లిచేశారు. చిన్నకూతురు జ్యోతి(21) అమలాపురంలో డిగ్రీ చదువుతూ కళాశాలకు వెళ్లొచ్చే క్రమంలో గ్రామంలోని దైవాలపాలెం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ మేడిశెట్టి సురేష్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి పదో తేదీన పెళ్లి చేసుకున్నారు. ఆమె గర్భిణి కావడంతో ఆషాఢమాసమని చెప్పి గత నెల 25న సురేష్‌ ఆమెను తన పుట్టింటికి పంపాడు. అతను వచ్చివెళ్తుండేవాడు. శుక్రవారం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి తీర్థం సందర్భంగా అతను తన సోదరి కుమార్తెను జ్యోతి వద్దకు తీసుకువచ్ఛి. రాత్రి 8 గంటలప్పుడు మళ్లీ తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తరువాత జ్యోతి, ఆమె తల్లి మంగాదేవి ఇంటిలోని ఒక గదిలో, తండ్రి లింగన్న మరో గదిలో నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఇంటిచుట్టూ మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉంటున్న జ్యోతి మేనమామ దుర్గారావు గమనించి కేకలు వేయడంతో లింగన్న బయటికి వచ్చేశారు. జ్యోతి(21), మంగాదేవి(40) మంటల్లో చిక్కుకుని కాలి బూడిదయ్యారు. అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంటలు చెలరేగుతుండడం చూసి అమ్మవారి ఆలయం వద్ద విద్యుత్తుదీపాల అలంకరణ చేస్తున్నవారు ఆకులవారివీధికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఆ సమయంలో ఓ మహిళ, మరో వ్యక్తి చేతులకు తొడుగులు ధరించి, బురద కాళ్లతో చీకట్లో పరుగులు తీసినట్లు చెబుతున్నారు.

పోలీసుల అదుపులో సురేష్‌, మరో ముగ్గురు..?

జ్యోతి భర్త సురేష్‌ను ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం స్థానిక సుంకరవారివీధికి చెందిన సురేష్‌ మాజీ ప్రియురాలితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

విచారణలో పురోగతి..

ఈ కేసులో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వారు తీసుకొచ్చిన జాగిలాలు ఘటనా స్థలం నుంచి ప్రధాన రహదారి వరకు వచ్చిఆగాయి. ఘటనా స్థలంలోనే అల్లవరం సీహెచ్‌సీ వైద్యులు మౌనిక, సుధీర్‌ శవ పంచనామా పూర్తి చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని అమలాపురం గ్రామీణ సీఐ వీరబాబు తెలిపారు. ఘటనాస్థలానికి కిలోమీటరు దూరంలోని పాతపంచాయతీ కార్యాలయం వద్ద కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఘటనాస్థలి నుంచి పారిపోతున్న ఇద్దరు వ్యక్తులు పురుషులా, స్రీలా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధానంగా ఇద్దరు యువతుల ప్రమేయం ఉందనే విషయమై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. పాత పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులకు లభించిన ఆధారాలు ఈ కేసును కీలక మలుపు తిప్పనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని