Updated : 03 Jul 2022 06:38 IST

బీటెక్‌ విద్యార్థి హత్య?

గుట్ట ప్రాంతంలో కుళ్లిన స్థితిలో మృతదేహం

మెడ చుట్టు తీగలు ఉండటంతో హత్యగా అనుమానం

ఠాగూర్‌ నాయక్‌ (పాత చిత్రం)

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: నాలుగు రోజుల క్రితం చదువుకునేందుకు చెన్నైకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఇంజినీరింగ్‌ విద్యార్థి మదనపల్లె పట్టణ శివార్లలో శవమై కన్పించిన ఘటన శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికబండతాండాకు చెందిన రెడ్డెప్పనాయక్‌ కుమారుడు ఠాగూర్‌నాయక్‌ (23) చెన్నైలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతను వారం రోజుల క్రితం స్వగ్రామంలో జరిగిన జాతరకు వచ్చి నాలుగు రోజుల క్రితం తిరిగి చెన్నైకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇతను మదనపల్లె పట్టణ శివార్లలోని బీకేపల్లె కాలనీ వెనుక భాగంలో ఉన్న గుట్ట కనుమ వద్ద విగతజీవుడై ఉంటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం ఇతను చనిపోయి ఉండటంతో మృతదేహం కుల్లిపోయింది. దుర్వాసన వస్తుండటంతో పశువుల కాపరులు గుర్తించి రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ మురళీకృష్ణ, ఎస్సై చంద్రమోహన్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి జేబులో ఉన్న చరవాణి ఆధారంగా మృతుడు తంబళ్లపల్లె వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చెన్నైకు వెళ్లిన వ్యక్తి గుట్ట ప్రాంతంలోకి ఎందుకు వెళ్లాడు. ఎలా మృతి చెందాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం పడి ఉన్న ప్రాంతంలో నలుగురు మద్యం తాగినట్లు ఖాళీ సీసాలు, గ్లాసులున్నాయి. మృతుడి మెడకు తీండ్ర తీగలు చుట్టి ఉండటంతో తీగలతో చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తెలుస్తోంది. మృతుడి జేబులో గంజాయి తాగేందుకు వినియోగించే చిలుం ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టీ మృతుడు మద్యం, గంజాయికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థి నిర్మాణుష్య ప్రాంతానికి ఎందుకు వచ్చాడు. ఇతనితో పాటు ఎవరెవరు వచ్చారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతదేహం కుళ్లి ఉండటంతో ఆదివారం ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు. ప్రస్తుతానికి వీఆర్వో నాగేంద్ర ఫిర్యాదు మేరకు మృతికి కారణాలు తెలియరాలేదని కేసు నమోదు చేస్తున్నామని పోస్టుమార్టం అనంతరం కేసు మార్పు చేస్తామని సీఐ తెలిపారు. ఠాగూర్‌నాయక్‌ మృతి చెందిన గుట్ట ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయని ఈ ప్రాంతంలో గస్తీ పెంచాలని స్థానికులు పోలీసులను కోరారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని