Updated : 07 Aug 2022 04:30 IST

Telangana news: అధ్యాపకుడి అకృత్యం

విద్యార్థినిని శారీరకంగా లొంగదీసుకునే యత్నం

కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పాఠాలు బోధించి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ అధ్యాపకుడు విద్యార్థినులపైనే కన్నేశాడు. డబ్బు ఆశజూపి ఒకరిని శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె సాయంతో అభంశుభం తెలియని మరో బాలికను బలవంతంగానైనా దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అసభ్య దృశ్యాల్ని వీడియోలో చిత్రీకరించి బెదిరించాలనుకున్నాడు. ఈ వైనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని ఓ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో పట్టణానికి చెందిన వ్యక్తి (50) 2008 నుంచి కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. గతేడాది కోర్సు పూర్తయిన ఓ విద్యార్థిని(20)కి డబ్బు, విలాస జీవితాన్ని ఆశజూపి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమెది కూడా జిల్లా కేంద్రమే. చదువు పూర్తయిన తర్వాతా తరచూ శిక్షణ కేంద్రానికి వచ్చివెళ్తోంది. సదరు అధ్యాపకుడు ప్రస్తుతం ఇదే కళాశాలలో చదువుతున్న మరో విద్యార్థిని(17)పైనా కన్నేశాడు. పేదింటికి చెందిన ఆమెను తన దారికి తెచ్చుకునేందుకు పూర్వ విద్యార్థినినే పావుగా వాడుకోవాలనుకున్నాడు. తరచూ బాలికతో మాట్లాడించాడు. ‘సార్‌తో చనువుగా ఉంటే కావాల్సినంత డబ్బు ఇస్తాడు. బయటకు తీసుకెళ్తాడు. ఏ పనికావాలన్నా చేసిపెడతాడంటూ’ నమ్మబలికించాడు. ఈ క్రమంలో 4వ తేదీన శిక్షణ కేంద్రంలోని ఓ గదిలో బాలికతో పూర్వ విద్యార్థిని ఏకాంతంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాడు. అసభ్యంగా ప్రవర్తించేలా చేసి ఆ దృశ్యాల్ని చరవాణిలో బంధించాడు. వాటి సాయంతో బాలికను శారీరకంగా లోబర్చుకోవాలన్నది ఆయన కుట్ర. ఆ దృశ్యాలు గత రెండ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. విషయం తెలిసిన ప్రిన్సిపల్‌ శుక్రవారం మధ్యాహ్నమే సిబ్బందితో సమావేశమై జరిగిన సంఘటనపై విచారణ చేశారు.

ప్రబుద్ధుడైన అధ్యాపకుడు, మరో ముగ్గురు విద్యార్థుల చరవాణుల్లో ఉన్న వీడియోలను గుర్తించారు. ‘డయల్‌-100’కు సమాచారమిచ్చారు. స్థానిక సీఐ రాజు వెంటనే అక్కడకు వచ్చారు. అధ్యాపకుడు, విద్యార్థులతో పాటు బాధిత బాలిక, పూర్వ విద్యార్థినిని వేర్వేరుగా విచారించారు. వీడియోలను చరవాణుల్లోంచి తొలగించారు. వారందరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బోధనా వృత్తికే మచ్చతెచ్చేలా ప్రవర్తించిన అధ్యాపకుణ్ని విధుల్లోంచి తొలగించాలంటూ 5వ తేదీన వరంగల్‌ ఆర్జేడీ, హైదరాబాద్‌లోని పారిశ్రామిక విద్య కమిషనర్‌కు వేర్వేరుగా లేఖలు పంపినట్లు ప్రిన్సిపల్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. పూర్వ విద్యార్థినితో అత్యంత సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసి గతంలోనూ మందలించామన్నారు. రెండు పర్యాయాలు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినా మారలేదన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యామ్నాయంగా వేరొకరితో బోధన చేయిస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వీడియో వైరల్‌ చేసిన ముగ్గురు విద్యార్థులను వారం రోజులు సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. సీఐ రాజును సంప్రదించగా యాజమాన్యం సమాచారంతో కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు. రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని