Crime News : చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ మోసం

చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని నమ్మబలికి మహిళ నుంచి డబ్బులు గుంజుతున్న వ్యక్తిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం తోటచర్లలో చోటుచేసుకుంది.

Updated : 07 Aug 2022 19:55 IST

పెనుగంచిప్రోలు: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని నమ్మబలికి మహిళ నుంచి డబ్బులు గుంజుతున్న వ్యక్తిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం తోటచర్లలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. తోటచర్లకు చెందిన ఒక వ్యక్తి మూడు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మృతితో భార్య మానసిక ఒత్తిడికి గురైంది. గత నెలలో గ్రామానికి ఒకరు సోది చెబుతానని రాగా.. అతనితో సోది చెప్పించుకుంది. తన భర్త చనిపోయిన విషయం అతనికి చెప్పింది. మీ ఇంటికి నాగ దోషం పట్టుకుందని, అందుకే భర్త చనిపోయాడని, రూ. 5 వేలు ఇస్తే దోషం వదిలిస్తానని చెప్పారు. ఆమె రూ. 5 వేలు ఇవ్వగా పూజలు చేశాడు. చనిపోయిన నీ భర్తను బతికించే శక్తి తన గురువుకు ఉందని ఒకరితో ఫోన్‌లో మాట్లాడించాడు. ఆ మాటలు నమ్మిన మహిళ సరేనని ఒప్పుకుంది. గురువు మొదట రూ.లక్ష డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.50 వేలకు ఒప్పుకున్నాడు. తొలుత సోది చెప్పేందుకు వచ్చిన వ్యక్తికి రూ. 20 వేలు ఇవ్వగా తీసుకొని వెళ్లిపోయాడు. ఆషాఢం వెళ్లిన తర్వాత పూజలు మొదలు పెడతామని తెలిపాడు. ఈలోగా ఆ మహిళ, గురువుతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడింది. ఆమె తొందర పెట్టడంతో సోది చెప్పిన వ్యక్తే శనివారం మహిళ ఇంటికి వచ్చాడు. మొదటి నుంచి ఆ తంతును గమనిస్తున్న ఇంటి చుట్టుపక్కలవ్యక్తులు అతన్ని పట్టుకొని గట్టిగా మందలించారు. తన పేరు పస్తం రెడ్డియ్య అని, తనది గుంటూరు జిల్లా తుళ్లూరు అని చెప్పాడు. తనకేమీ తెలియదని, డబ్బులు గురువే తీసుకున్నాడని వాపోయాడు. గ్రామస్థులు అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. మహిళ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. గతంలో ఇచ్చిన నగదును తిరిగి మహిళకు ఇప్పించారు. ఎస్సై హరిప్రసాద్‌ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని, తుళ్లూరులో ఉన్న గురువును రప్పించి విచారణ చేస్తామని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని