Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!

ప్రయాణికుడిని కారు కిరాయి అడిగితే డ్రైవర్‌పై స్నేహితులతో కలిసి దాడిచేశాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో బాధితుడు కోమాలోకి చేరాడు. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు, బాధితులు తెలిపిన వివరాలివీ..

Updated : 08 Aug 2022 12:36 IST


డ్రైవర్‌పై దాడికి పాల్పడుతున్న దృశ్యం

ఈనాడు, హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ప్రయాణికుడిని కారు కిరాయి అడిగితే డ్రైవర్‌పై స్నేహితులతో కలిసి దాడిచేశాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో బాధితుడు కోమాలోకి చేరాడు. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు, బాధితులు తెలిపిన వివరాలివీ.. ఉప్పర్‌పల్లికి చెందిన వివేక్‌రెడ్డి(26) గత నెల 31న రాత్రి బీఎన్‌రెడ్డినగర్‌ నుంచి ఉప్పర్‌పల్లికి కారు బుక్‌ చేసుకున్నాడు. నారాయణ్‌ఖేడ్‌కు చెందిన వెంకటేష్‌(27) కారు డ్రైవర్‌. అతడు కారుతో వివేక్‌ ఉన్నచోటికి చేరుకున్నాడు. మధ్యలో వెంకటేష్‌ కారు యజమాని పర్వతాలునూ వాహనంలో ఎక్కించుకున్నాడు. ఉప్పర్‌పల్లి చేరాక.. మద్యం మత్తులో ఉన్న వివేక్‌రెడ్డి రూ.600 కిరాయి ఇవ్వకుండా కారు దిగి వెళ్లిపోబోయాడు. డబ్బు అడగ్గా గొడవకు దిగాడు. ఈ విషయాన్ని వివేక్‌ ఫోన్‌ ద్వారా స్నేహితులకు చేరవేయగా.. 20 మంది యువకులు అక్కడకు చేరుకొని డ్రైవర్‌, యజమానిని చితకబాదారు. డబ్బు ఇవ్వకున్నా పర్వాలేదంటూ కాళ్లమీద పడ్డా కనికరం చూపలేదు. క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా కొట్టారు. పెట్రోలింగ్‌ వాహనంలో వచ్చిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినా.. నిందితులు వారిముందే దాడిచేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

కానిస్టేబుల్‌ సహకారం?

వెంకటేష్‌, పర్వతాలే తమపై దాడి చేసి, బంగారు గొలుసు కొట్టేశారంటూ యువకులు రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దాంతో బాధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించకుండా మర్నాడు ఉదయం వరకూ ఠాణాలోనే కూర్చోబెట్టారు. వెంకటేష్‌ వాంతులు చేసుకొని కుప్పకూలాడు. బంధువులకు సమాచారం ఇచ్ఛి. ఇద్దరినీ ఉస్మానియా దవాఖానాకు తరలించారు. వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉందడని చెప్పటంతో.. అక్కడ్నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఏడు రోజులుగా వెంకటేష్‌ కోమాలోనే ఉన్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్వతాలు కోలుకుంటున్నట్టు సమాచారం. ఆసుపత్రిలోకి చేర్చాక బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని.. వివేక్‌రెడ్డి అతడి స్నేహితులపై తొలుత సెక్షన్‌ 324 కింద.. రెండు రోజుల తర్వాత సెక్షన్‌ 307 కేసు నమోదు చేశారు. వివేక్‌రెడ్డి న్యాయస్థానంలో లొంగిపోగా కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. యువకులను తప్పించేందుకు ఓ కానిస్టేబుల్‌ సహకరించారనే ఆరోపణలున్నాయి. నిందితుడిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని, దాడికి పాల్పడిన యువకుల వివరాలూ సేకరిస్తున్నామని శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. నిందితులకు పోలీసులు సహకరించినట్లు నిర్ధారణ అయితే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడి ఘటనపై రాజేంద్రనగర్‌ సీఐ నాగేంద్రబాబును వివరణ కోరగా.. పోలీసుల ముందు దాడిచేశారనేది అవాస్తవమని పేర్కొన్నారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని