Updated : 09 Aug 2022 06:01 IST

రౌడీ షీటర్ల కత్తులాట

జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై దారుణాలు
కానిస్టేబుల్‌ హత్య.. పోలీసుల వైఫల్యమేనా?

ఈనాడు - కర్నూలు, నంద్యాల నేరవిభాగం- న్యూస్‌టుడే: నంద్యాలలో శాంతి భద్రతలు గాడితప్పుతున్నాయి. రౌడీ షీటర్లు కత్తులతో హల్‌చల్‌ చేస్తున్నారు. సినిమాను తలపించేలా పోలీసులను పరిగెత్తించి అతిదారుణంగా కడతేర్చుతున్నారు. ఆదివారం జరిగిన కానిస్టేబుల్‌ హత్యతో జిల్లా కేంద్ర వాసులు ఒక్కసారిగా ఉల్కి పడ్డారు. పలు హత్య కేసుల్లో నిందితులు.. రౌడీ షీటర్లు పట్టణంలో తిరుగుతూ దందాలు చేస్తున్నారు. నిఘా ఉంచాల్సిన పోలీసుశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నడిరోడ్డుపై దారుణాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

ఆదివారం ఏం జరిగింది

నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌(35) ఆదివారం రాత్రి హత్యకు గురయ్యారు. తిరుమల ప్రయాణం నేపథ్యంలో చిరిగిన తన బ్యాగు కుట్టించుకోవడానికి బయటకెళ్లారు. అక్కడ ఓ భవనం పైఅంతస్తులో మద్యం మత్తులో హల్‌చల్‌ చేస్తున్న కొందరు కానిస్టేబుల్‌కు తారసపడ్డారు. ‘‘పోలీస్‌’’ అని చెప్పగానే మాకేంటి అంటూ ఆ ఆరుగురు బీరు సీసాలతో తలపై ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. సురేంద్రకుమార్‌ వాళ్ల నుంచి తప్పించుకొనేందుకు కొంత దూరం పరిగెత్తగా వెంబడించి పట్టుకుని ఆటోలో ఎక్కించినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. అరుస్తున్నవారిని వారించబోయి నందుకే కిడ్నాప్‌ చేసి కత్తులతో దాడి చేసి చంపుతారా? అనేది ప్రశ్నగా మిగిలింది.

10 హత్యలు... 22 హత్యాయత్నాలు

నంద్యాల పట్టణంలో కొందరు యువకులు గ్యాంగ్‌లుగా తిరుగుతూ హత్యలకు పాల్పడుతున్నారు. నంద్యాల జిల్లాగా ఏర్పాటైన తర్వాత హత్యల పరంపర ఎక్కువైంది. స్థిరాస్తి వ్యాపారం పెరగడంతో స్థలాల ఘర్షణలకు తావిస్తోంది. రౌడీషీటర్లు పంచాయితీలు చేస్తూ అమాయకులను బెదిరిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని మూడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 2021 నుంచి ఇప్పటి వరకు పది హత్యలు.. 22 హత్యాయత్నాలు నమోదవ్వడం నేర సంస్కృతి పెరిగిందనడానికే తార్కాణం.

తండ్రి హత్యా వారసత్వాన్ని

కానిస్టేబుల్‌ హత్య కేసులో ఇరువురిని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు నాలుగు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండటమే కాకుండా అతనిపై రౌడీషీట్‌ నమోదై ఉంది. అతని తండ్రి గొంతుకోసి చంపడంలో స్పెషలిస్టుగా.. మర్డర్ల ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అతని కుమారుడు ప్రస్తుతం పట్టపగలే హత్యలు చేస్తూ ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాడు. గతేడాది పట్టణంలో ఎన్జీవో కాలనీలో ఓ రౌడీషీటర్‌ను కత్తులతో అతి దారుణంగా నరికి చంపిన హత్య కేసులో ప్రధానంగా వ్యవహరించినట్లు సమాచారం. కానిస్టేబుల్‌ హత్యలో పాల్గొన్న ఆరుగురిలో ముగ్గురు పలు హత్య కేసుల్లో ఉన్నారు.

పెట్రోలింగ్‌ నామమాత్రమే

పోలీసులు సాంకేతికను ఉపయోగించి గస్తీలు పర్యవేక్షిస్తున్నారు. బ్లూకోట్స్‌ 10 ఉండగా ప్రతి పోలీస్‌స్టేషన్‌కు రెండు ద్విచక్ర వాహనాలు గస్తీ తిరుగుతున్నాయి. విధుల్లో ఉండే పోలీసులు తప్పకుండా రాత్రిళ్లు సెల్ఫీ దిగి పోలీసులు అధికారులకు పంపుతున్నారు. పెట్రోలింగ్‌ కేవలం చిత్రాలకే పరిమితమైందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది సిబ్బంది సెల్ఫీలు సమయానికి దిగి విధుల్లో తిరగడం లేదని తెలుస్తోంది. ఆదివారం రాత్రి జరిగిన సంఘటన చూస్తే పోలీస్‌ పెట్రోలింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిఘా నేత్రాలకు మస్కా

నంద్యాల పట్టణంలో సీసీఎస్‌ కంట్రోల్‌లో 69 సీసీ కెమెరాలు ఉండగా 40 పనిచేస్తున్నాయి. అమరావతి బృహస్పతి అనే సీసీ కెమెరాలు 162 ఉండగా.. పన్నెండు మూలకు చేరాయి. మరోవైపు సిబ్బంది కొరత వేధిస్తోంది. నంద్యాలలో ప్రతి పోలీస్‌స్టేషన్‌ సీఐగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఆ స్టేషన్లలో సిబ్బందిని పెంచలేదు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు 45 మంది సిబ్బంది అవసరంకాగా, ప్రస్తుతం ఒక్కో స్టేషన్‌లో ఇరవై మంది కంటే ఎక్కువ లేరు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని