Updated : 11 Aug 2022 06:34 IST

బాలికను పెళ్లి చేసుకుంటానని వేధించడం వల్లే హత్య

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నరసప్ప, సీఐ, ఎస్‌ఐ తదితరులు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: అరవై ఏళ్ల వృద్ధుడు.. పదహారేళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అతను పెట్టే వేధింపులు భరించలేక బాలిక కుటుంబసభ్యులు హత్యకు పాల్పడ్డారని తిరుపతి పడమర డీఎస్పీ బారిక నరసప్ప పేర్కొన్నారు. ముత్యాలరెడ్డి పల్లి సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్సై వినోద్‌కుమార్‌తో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో ఈ నెల 7వ తేదీ స్థానిక ఉల్లిపట్టెడలో తితిదే విశ్రాంత ఉద్యోగి నారాయణ స్వామి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిందితులను ప్రవేశపెట్టారు. ‘ముత్యాలరెడ్డి పల్లి సమీపంలోని ఉల్లిపట్టెడలో తితిదే విశ్రాంత ఉద్యోగి నారాయణస్వామి(63) నివసిస్తున్నారు. అతని పక్కింట్లో ఉన్న ఓ బాలిక (16)ని పెళ్లి చేసుకోవాలని ఆ కుటుంబ పెద్దలను అడిగారు. అంత వయస్సు తేడా ఉంటే ఎలా పెళ్లి చేస్తామని చెప్పారు. తర్వాత జరిగిన గొడవలో తన బంగారు గొలుసును బాలిక తల్లి, తమ్ముడు కాజేశారని నారాయణస్వామి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వాళ్లను స్టేషన్‌ చుట్టూ తిప్పించారు. అంతటితో ఆగక ఓ రోజు ఆ బాలిక చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు నారాయణ స్వామిపై పగ పెంచుకుని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. 7వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఆహారం కోసం నారాయణ స్వామి వీధిలోకి రాగా.. బాలిక పెద్దమ్మ భారతి (51) అతని వద్దకు వెళ్లి రెండు చేతులు పట్టుకోగా.. అదే కుటుంబానికి చెందిన హేమాద్రి (20), రమేష్‌(47) తీసుకొచ్చిన రెండు కత్తులతో వీపుపై ఐదు సార్లు పొడవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ నెల 10వ తేదీ రామానుజపల్లి చెక్‌పోస్టు వద్ద ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి.. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, టవల్‌ స్వాధీనం చేసుకున్న’ట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని