Updated : 14 Aug 2022 06:03 IST

మరణంలోనూ వీడని స్నేహం

ఎరువుల బస్తాలు మీద పడి మిత్రుల దుర్మరణం

నరేశ్‌గౌడ్‌, చిన్న సుధాకర్‌రెడ్డి

మాగనూరు, న్యూస్‌టుడే : ఇద్దరిదీ ఒకే ఊరు. దగ్గర దగ్గర ఇళ్లు. కలిసి చదువకున్నవారు ఎక్కడి వెళ్లినా కలిసే ఉండేవారు. వారి స్నేహాన్ని చూసి విధికే కన్నుకుట్టిందేమో.. రాత్రి పడుకున్న సమయంలో ప్రమాద రూపంలో ఇద్దరినీ బలిగొంది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అడవి సత్యవార్‌ గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాధవరెడ్డి కుమారుడు చిన్న సుధాకర్‌రెడ్డి (25), శివన్నగౌడ్‌ మూడో కుమారుడు నరేశ్‌గౌడ్‌ (24) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. నరేశ్‌గౌడ్‌ ఊళ్లోనే ఉండి వ్యవసాయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండగా.. చిన్న సుధాకర్‌రెడ్డి ట్రాక్టర్‌ మెకానిక్‌ పని నేర్చుకొని మక్తల్‌లోని షోరూంలో కొన్నాళ్లు పని చేశారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండటంతో ఊళ్లోనే ఉంటున్నారు. వరినాట్లు వేయడం కోసం ఇటీవలే సుధాకర్‌రెడ్డి తండ్రి 80 బస్తాల ఎరువులు తెచ్చి పొలంలోని షెడ్డులో నిల్వ ఉంచారు. శుక్రవారం రాత్రి ఇద్దరూ మిత్రులు పొలం వద్దకు వెళ్లి షెడ్డులో పడుకొని ఉండగా.. శనివారం తెల్లవారు జామున పక్కనే ఉన్న ఎరువుల బస్తాలు దొర్లి మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం పొలం వద్దకు వెళ్లిన మాధవరెడ్డి బస్తాలు పడిపోవడంతో తొలగించి చూడగా ఇద్దరూ మృతి చెంది కనిపించారు. వర్షాల కారణంగా ఎరువుల బస్తాలకు తేమ తగలకుండా టార్పాలిన్‌ కప్పి ఉంచారు. రాత్రివేళ పొలం దగ్గర ఉండే కుక్కలు బస్తాలపై పడుకొన్న సందర్భంగా టార్పాలిన్‌ను కదిలించడంతో టార్పాలిన్‌ ముందుగా నరేశ్‌గౌడ్‌, సుధాకర్‌రెడ్డిపై పడి, దానిపై బస్తాలు పడటంతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు భావిస్తున్నారు. సుధాకర్‌రెడ్డికి ఏడాది కిందటే వివాహం కాగా 15 రోజుల కిందటే కుమారుడు జన్మించాడు. నరేశ్‌గౌడ్‌కు ఇంకా వివాహం కాలేదు. చిన్న వయస్సులోనే చనిపోయిన తమ కుమారులను చూస్తూ తల్లిదండ్రులు రోదించిన తీరు గ్రామస్థులను కలిచివేసింది.
 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts