Updated : 15 Aug 2022 06:06 IST

‘కూలిన’ బతుకులు

ఆటోపై చెట్టు పడడంతో ఇద్దరి దుర్మరణం

ఆటోలోనే మృతి చెందిన సింహాచలం, మహేష్‌

మెంటాడ, న్యూస్‌టుడే: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వారివి.. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం ఇతర ప్రాంతానికి వెళ్లారు.. తిరిగొచ్చే క్రమంలో మృత్యువు వారిని వెంటాడింది. వాహనంలో సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్న వారిపై చెట్టు పడింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. మెంటాడ మండలంలోని లోతుగెడ్డ మధుర గ్రామాలైన కొండపర్తిబాడవ, తోటవలస, ఆండ్ర తదితర గ్రామాలకు చెందిన 12 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు ఆదివారం పిట్డాడ వెళ్లారు. పనులు పూర్తయ్యాక సాయంత్రం ఆటోలో తిరుగు పయనమయ్యారు. బయలుదేరిన కొంతసేపటికే వారి గుండెలు ఉలిక్కిపడ్డాయి.

ఉన్నట్టుండి పెద్ద తాటిచెట్టు ఆటోపై కూలింది. దీంతో చోదకుడు రొంగళి మహేష్‌(30), జునపాల సింహాచలం(32) అనే మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆండ్ర బస్టాండ్‌ దరిలో నివాసముంటున్న తామరాపల్లి రాజ్యలక్ష్మికి స్వల్ప గాయాలు కాగా.. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సంఘటన సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులతో పాటు, సమీప ప్రాంతాలవాసులు పరుగున వచ్చి వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీశారు. ఆటో నుజ్జునుజ్జవడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకొని ఆండ్ర ఎస్‌ఐ సుదర్శనరావు తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గజపతినగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు.

తల్లి, చెల్లితో వెళ్లి..

ఈ ప్రమాదంలో కొండపర్తి బాడవకు చెందిన సింహాచలం మృతి చెందారు. ఈమెకు భర్త మహేష్‌, ఇద్దరు అబ్బాయిలున్నారు. రోజూ భర్తతో కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం తల్లి పొయిరి అచ్చమ్మ, సోదరితో కలిసి పిట్టాడ వెళ్లారు. సింహాచలం మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

ఆదుకుంటాడనుకుంటే..

పిట్టాడకు చెందినఆర్‌.మహేష్‌ తల్లిదండ్రులు మంగమ్మ, సత్యం వ్యవసాయ కూలీలు. అతని సోదరికి వివాహం కాగా.. మహేష్‌ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూలీలను దించి వస్తానని చెప్పి, విగతజీవిగా తిరిగి వచ్చాడని ఆ వృద్ధ దంపతులు తీవ్రంగా రోదిస్తున్నారు. ఆదుకుంటాడనుకుంటే అనంతలోకాలకు వెళ్లిపోయాడని విలపించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని