Hyderabad News: హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం

నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అక్కడ విందు చేసుకున్న కొందరు యువకులు తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. నెల క్రితం జరిగిన ఘటన వీడియో సామాజిక మాధ్యమాల

Updated : 16 Aug 2022 10:34 IST

ఫాంహౌస్‌లో ఎయిర్‌ గన్‌ పేల్చుతూ యువకుల సరదా

ఆలస్యంగా వెలుగులోకి.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

కాల్పులు జరుపుతున్న చిత్రం సామాజిక మాధ్యమంలో

ఈనాడు- హైదరాబాద్‌ - యాచారం, కందుకూరు, న్యూస్‌టుడే: నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అక్కడ విందు చేసుకున్న కొందరు యువకులు తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. నెల క్రితం జరిగిన ఘటన వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికిసంబంధించి పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడకు చెందిన జిట్ట్టా రవీందర్‌రెడ్డికి యాచారం మండలం నజ్దిక్‌సింగారం రెవెన్యూ పరిధిలో ఫాంహౌస్‌ ఉంది. ఇందులో కందుకూరు చెందిన యువకులు అప్పుడప్పుడు విందు చేసుకుంటుంటారు. జులై 14న ఏర్పాటు చేసిన విందులో విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రంరెడ్డి సహా 15మంది యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి తన వద్ద ఉండే ఎయిర్‌గన్‌ను బయటకు తీసి మిత్రులకు చూపాడు. దాన్ని తీసుకుని కొందరు గాలిలోకి కాల్పులు జరుపుతూ ఫొటోలు దిగారు. గాల్లోకి పేలుస్తూ తీసిన వీడియోను ఆ రోజే కొందరు వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకుని కొద్దిసేపటి తరువాత తీసేశారు. అందులోని వీడియో ఒకటి సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. యాచారం సీఐ లింగయ్య.. ఫాంహౌస్‌ను పరిశీలించి అక్కడ ఉన్న ఎయిర్‌గన్‌ (మోడల్‌-35), పిల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గన్‌ కొనుగోలు చేసిన పత్రాలను పరిశీలించారు. పక్షులు, అడవి పందులు పంట ధ్వంసం చేయకుండా రక్షించుకోవడానికి ఎయిర్‌గన్‌ను కొనుగోలు చేసి వాడుతున్నట్లు జిట్టా రవీందర్‌రెడ్డి చెప్పారు. మారణాయుధాల చట్ట పరిధిలోకి (ఆర్మ్‌ యాక్టు) ఎయిర్‌ గన్‌ రాదని సీఐ లింగయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని