బొలేరోతో ఢీకొట్టి.. గొడ్డళ్లతో నరికి

ఈనెల 13న తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన న్యాయవాది గాదె విజయ్‌రెడ్డి(40) హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. 2006 నుంచి 2022 వరకు విజయ్‌రెడ్డితో భూ వివాదాలతో పాటు వ్యక్తిగత కక్షలు ఉన్న

Updated : 19 Aug 2022 06:24 IST

నిందితులను మీడియాకు చూపుతున్న ఎస్పీ రెమారాజేశ్వరి

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఈనెల 13న తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన న్యాయవాది గాదె విజయ్‌రెడ్డి(40) హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. 2006 నుంచి 2022 వరకు విజయ్‌రెడ్డితో భూ వివాదాలతో పాటు వ్యక్తిగత కక్షలు ఉన్న ఊట్కూరి సందీప్‌రెడ్డి, ఊట్కూరి ప్రవీణ్‌రెడ్డితో పాటు విజయ్‌రెడ్డి భూమి పక్కనే భూమి ఉన్న మన్యం ఉపేందర్‌రెడ్డిలు హత్య చేసినట్లు తెలిపారు. మృతుడు విజయ్‌రెడ్డి 2006లో ఓ బాలిక విషయంలో వారిపై ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లివచ్చారు. ఆతరువాత 2016లో నల్గొండలో 200 గజాల స్థలం విషయంలో సందీప్‌రెడ్డిపై టూటౌన్‌లో కేసు నమోదు చేశారు. 2019లో విజయ్‌రెడ్డి భార్య సంధ్య సర్పంచిగా గెలిచిన నాటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. మనస్తాపం చెందిన సందీప్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డిలు కలిసి ఏడాది క్రితం నుంచి హత్య చేయడానికి పలుమార్లు ప్రయత్నించారు. ఇటీవల రెండు గొడ్డళ్లు కొనుగోలు చేసి వారి బొలేరో వాహనంలో పెట్టుకుని అదను కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో విజయ్‌రెడ్డి పక్క భూమి యజమాని కేతేపల్లి మండలం చెరుకుపల్లికి చెందిన మన్యం ఉపేందర్‌రెడ్డితో గొడవలు అయ్యాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న వారు ఉపేందర్‌రెడ్డితో స్నేహం పెంచుకున్నారు. వారంలో శని, ఆదివారాలు వ్యవసాయ భూమి వద్దకు వచ్చివెళ్లే హతుడి కదలికలు ఉపేందర్‌రెడ్డి ద్వారా తెలుసుకున్న వారు బొలేరో వాహనంతో ఢీకొట్టారు. కింద పడిన విజయ్‌రెడ్డిని గొడ్డళ్లతో మెడ ఇతర భాగాలపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుల్లో సందీప్‌రెడ్డిపై గతంలో పది కేసులు, ప్రవీణ్‌రెడ్డిపై రెండు కేసులున్నట్లు తెలిపారు. మృతుడి భార్య గాదె సంధ్య ఫిర్యాదుతో విచారణ చేయగా నిందితులు వాస్తవాలు ఒప్పుకున్నట్లు ఎస్పీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని