కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఆత్మహత్య

కుటుంబంలో తరచూ కలహాలను భరించలేక ఆవేదన చెంది కన్నకూతురితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం జప్తిసింగాయపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు ఐలయ్య, గంగమ్మ(50) దంపతులు.

Updated : 20 Aug 2022 06:03 IST

ములుగు, న్యూస్‌టుడే: కుటుంబంలో తరచూ కలహాలను భరించలేక ఆవేదన చెంది కన్నకూతురితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం జప్తిసింగాయపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు ఐలయ్య, గంగమ్మ(50) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెను మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లికి చెందిన వ్యక్తికి ఇచ్చ మూడేళ్ల క్రితం పెళ్లి చేయించారు. ఆమె గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. ఐలయ్య రెండో కుమార్తె జ్యోతి(25) మానసిక దివ్యాంగురాలు. కొడుకులు లేకపోవడంతో గంగమ్మ గతంలోనే భర్తకు తన బంధువర్గంలోని ఓ మహిళతో రెండో పెళ్లి చేసింది. కొద్దికాలం బాగానే ఉన్నా అనంతరం గంగమ్మను, ఆమె కుమార్తె మానసిక దివ్యాంగురాలైన జ్యోతిని కుటుంబంలో సరిగా చూడటం లేదు. తరచూ సవతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ కాగానే జ్యోతిని తీసుకొని గంగమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గతంలో రెండుమూడు సార్లు అలా వెళ్లి చుట్టాలింట్లో ఉండి మళ్లీ వచ్చేది. ఈసారి తిరిగి రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం జప్తిసింగాయపల్లి అటవీ ప్రాంతంలో కాలిపోయి ఉన్న ఇద్దరు మహిళల మృతదేహాలను గొర్ల కాపరులు చూసి పోలీసులకు చెప్పారు. ములుగు ఎస్‌ఐ రంగ కృష్ణ మృతదేహాలను పరిశీలించి గంగమ్మ, జ్యోతిగా గుర్తించారు. సవతితో కలహాల కారణంగానే గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ముందుగా తల్లీకూతురు తమ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసి ఓ బట్టలో మూట కట్టి అక్కడే పక్కన ఉంచారు. వెంట తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకొని నిప్పంటించుకున్నారని పోలీసులు తెలిపారు. తాను చనిపోతే దివ్యాంగురాలైన కుమార్తె బతుకు కష్టమవుతుందనే బాధతోనే ఆమెతో పాటు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని చెబుతున్నారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని