Hyderabad News: బిడ్డకు జన్మనిచ్చి భార్య మృతి.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

వారిద్దరు ప్రేమించుకున్నారు.. అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినప్పటికీ వివాహం చేసుకుని నగరానికి వచ్చి ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

Updated : 20 Aug 2022 11:10 IST

రెజిమెంటల్‌ బజార్‌, సికింద్రాబాద్‌: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినప్పటికీ వివాహం చేసుకుని నగరానికి వచ్చి ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారి సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. నవమాసాలు మోసిన బిడ్డను భర్త చేతిలో పెట్టి ఆ భార్య పురిట్లోనే కన్నుమూసింది. ఎంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య ఇకలేదన్న బాధను భరించలేక ఆ భర్త కూడా తనువు చాలించాడు. దీంతో రోజుల చిన్నారి అనాథగా మిగిలిపోయింది. ఈ హృదయవిదారక ఘటన సికింద్రాబాద్‌ పరిధిలో చోటుచేసుకుంది.

సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట్ జిల్లా మక్తల్‌కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్ (28).. తన ఇంటిపక్కనే ఉండే భీమేశ్వరి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో ఏడాది క్రితం వివాహం చేసుకుని నగరానికి వచ్చి మౌలాలి ప్రగతినగర్లో నివాసముంటున్నారు. నవీన్ కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  ఈ నెల 18 వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో భీమేశ్వరికి పురిటి నొప్పులు రావడంతో పక్కింటి మహిళ సాయంతో ఆమెను నేరేడ్‌మెట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రసవం అనంతరం భీమేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లితో పాటు శిశువును గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. శిశువును వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి ఆస్పత్రిలో మృతిచెందింది. చిన్నారి వెంటిలేటర్‌పై, మార్చురీలో భార్య మృతదేహం ఉండటంతో నవీన్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బాధను భరించలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

శుక్రవారం రాత్రి 8.55 గంటల సమయంలో సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా ఆర్పీఎఫ్ హోంగార్డు గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా మృతుడి జేబులో లభ్యమైన సెల్‌ఫోన్‌ ఆధారంగా అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం భార్యభర్తల మృతదేహాలు గాంధీ మార్చురీలో ఉన్నాయి. పుట్టిన చిన్నారి ఇదే ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండటం చూసిన వారిని కంటతడిపెట్టిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని