Vizag: కుమారుడి వివాహం చూడకుండానే.. దంపతుల దుర్మరణం

జీవితంలో ఎన్నోకష్టాలు అనుభవించారు. చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుని నేడు మంచి స్థితికి చేరుకున్నారు. జీవితంలో స్థిరపడ్డారు. ఇటీవలే కుమారుడికి పెళ్లి నిశ్చయమైంది. ఈ వేడుకను కళ్లారా చూడకుండానే అనుకోని ప్రమాదంలో

Updated : 04 Sep 2022 07:35 IST

ప్రమాదంలో నుజ్జయిన కారు 

రణస్థలం, పీఎం పాలెం, న్యూస్‌టుడే: జీవితంలో ఎన్నోకష్టాలు అనుభవించారు. చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుని నేడు మంచి స్థితికి చేరుకున్నారు. జీవితంలో స్థిరపడ్డారు. ఇటీవలే కుమారుడికి పెళ్లి నిశ్చయమైంది. ఈ వేడుకను కళ్లారా చూడకుండానే అనుకోని ప్రమాదంలో మృత్యుఒడికి చేరిపోయారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం సమీపంలోని జాతీయ రహదారిపై కందివలస గెడ్డ వంతెన వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో దంపతులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

విశాఖ నగరంలోని కొమ్మాదిలో నివాసముంటున్న బగాది షణ్ముఖరావు(55), బగాది విజయలక్ష్మి(48)లు తమ కుమారుడు సంతోష్‌తో కలిసి శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలస గ్రామంలోని రాజమ్మతల్లి ఆలయానికి మొక్కు తీర్చుకోవడానికి శనివారం ఉదయం 5 గంటల సమయంలో బయలుదేరారు. మొక్కు తీర్చుకుని మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి స్వగ్రామం వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షణ్ముఖరావు, విజయలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుమారుడు సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన చేరుకున్నారు. ప్రమాద సమయంలో సంతోషే డ్రైవింగు చేస్తున్నాడు. ఇతనికి తీవ్ర గాయాలైనప్పటికీ తల్లిదండ్రుల వద్దే రోదిస్తూ ఉండిపోయాడు. జేఆర్‌పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఎస్‌ఐ రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి: మృతుల స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఓవీపేట. షణ్ముఖరావు 35 సంవత్సరాల కిందటే బతుకుతెరువు కోసం విశాఖ వెళ్లిపోయారు. అక్కడ వివిధ పనులు చేసుకుంటూ కొన్నాళ్ల పాటు మాల్కాపురం ప్రాంతంలో నివాసముండేవారు. కొమ్మాదిలో కొత్తగా ఇల్లు కొనుక్కొని అక్కడికి మకాం మార్చారు. వీరికి కుమార్తె ఝాన్సీ, కుమారుడు సంతోష్‌ ఉన్నారు. కుమార్తెకు వివాహమై అమెరికాలో నివాసముంటుంది. కుమారుడు మెరైన్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహం నిశ్చయమైంది. ఈలోపు రాజమ్మ తల్లికి మొక్కు తీర్చుకుందామని కారులో వత్సవలస వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా మృత్యువు కబళించింది. ఈ ఘటనతో స్వగ్రామంలో, కొమ్మాదిలో విషాదం అలముకుంది.

బగాది షణ్ముఖరావు, విజయలక్ష్మి (పాత చిత్రాలు) 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు