Hyd News: దిల్లీ సీఎం సరేనంటే రూ.25 లక్షలు నీకే.. కేబీసీ పేరిట మోసం

కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమం కింద రూ.25 లక్షలు గెలిచావంటూ సందేశం పంపాడు. ఈ డబ్బు చెల్లించాలంటే దిల్లీ సీఎం అప్రూవల్‌ ఛార్జీలు, సీబీఐ ఛార్జీలు చెల్లించాలంటూ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు..

Updated : 06 Sep 2022 07:41 IST

 

ఈనాడు, హైదరాబాద్‌: కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమం కింద రూ.25 లక్షలు గెలిచావంటూ సందేశం పంపాడు. ఈ డబ్బు చెల్లించాలంటే దిల్లీ సీఎం అప్రూవల్‌ ఛార్జీలు, సీబీఐ ఛార్జీలు చెల్లించాలంటూ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.3.03 లక్షలు కొట్టేశారు. దీనిపై బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని సూరారంలో ఉండే వ్యక్తి(27)కి ఆగస్టు 15న వాట్సాప్‌లో సందేశం వచ్చింది. కౌన్‌ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) పేరిట రూ.25 లక్షలు గెలిచావంటూ బ్రోచర్‌ పంపాడు. అనంతరం రాణా ప్రతాప్‌ సింగ్‌ పేరిట ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు కేబీసీలో గెలిచిన డబ్బు పొందాలంటే కిరణ్‌ కుమార్‌ శర్మకు ఫోన్‌ చేయాలంటూ నంబరు ఇచ్చాడు. నమ్మిన బాధితుడు ఆ నంబరుకు ఫోన్‌ చేయగా.. బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు పంపాలని సూచించాడు. డబ్బు చెల్లించాలంటే దిల్లీ ముఖ్యమంత్రి అప్రూవల్‌ ఛార్జీ, సీబీఐ ఛార్జీ, డాక్యుమెంటేషన్‌, రవాణా, ఎన్‌వోసీ, ఎల్‌ఐసీ పాలసీ ఖాతా సహా కొన్ని రకాల రుసుములు చెల్లించాలని చెప్పాడు. దీంతో బాధితుడు.. గౌరవ్‌ కుమార్‌, శరద్‌ సింగ్‌, రాహుల్‌, కిషన్‌ లాల్‌ మోహిత్‌ జీ, మహ్మద్‌ అనస్‌ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలకు తన మిత్రుల ద్వారా మొత్తం రూ.3.03 లక్షలు పంపాడు. మరోసారి నిందితుడు ఫోన్‌ చేసి రూ.25 లక్షల పెద్దమొత్తం ఉన్నందున భద్రత(సెక్యూరిటీ పర్పస్‌) కోసమంటూ మరో రూ.31 వేలు పంపాలని కోరాడు. పదేపదే డబ్బు అడగడంతో అనుమానం వచ్చిన బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇటీవల కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని