పాత కక్షల నేపథ్యంలోనే హత్య!

గన్నవరం మండలం తెంపల్లి శివారు బల్లిపర్రులో కలకలం రేపిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆచూకీ శనివారం లభించింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. బల్లిపర్రు వద్ద పోలవరం కుడి కాలువ సమీపంలో రెండ్రోజుల నుంచి

Updated : 25 Sep 2022 05:54 IST

బల్లిపర్రు ఘటనలో మృతుడి ఆచూకీ లభ్యం

పుచ్చకాయల వెంకట శ్రీనివాసరెడ్డి ( పాత చిత్రం)

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం తెంపల్లి శివారు బల్లిపర్రులో కలకలం రేపిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆచూకీ శనివారం లభించింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. బల్లిపర్రు వద్ద పోలవరం కుడి కాలువ సమీపంలో రెండ్రోజుల నుంచి విపరీతమైన దుర్వాసన వెలువడుతుండడాన్ని రైతులు, స్థానికులు గమనించి ఆత్కూరు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలిలో తవ్వించగా, గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఇతన్ని హత్యచేసి, పూడ్చినట్టు అనుమానం వ్యక్తం చేసిన ఎస్సై కిశోర్‌ బృందం తొలుత అదృశ్యం కేసులను ఆరా తీశారు. తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలేనికి చెందిన పుచ్చకాయల వెంకటశ్రీనివాసరెడ్డి(39) ఈనెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని గుర్తించిన పోలీసులు.. ఆయన కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి పరిశీలించి, ఆ మృతదేహం అతనిదేనని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసిన పోలీసులు హత్యకుగల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు

స్థిరాస్తి వ్యాపారం చేసే వెంకటశ్రీనివాసరెడ్డి మొదట్నుంచి వివాదాస్పదుడేనని పోలీసులు తెలిపారు. గతంలో ఆయన తండ్రి కూడా హత్యకు గురవగా.. ఆ కేసులో నిందితులను శ్రీనివాసరెడ్డి కిరాయి గూండాలతో హత్యచేయించినట్టు ఆరోపణలున్నాయని చెప్పారు. ఆ కేసులో ఇటీవల జైలు జీవితాన్ని కూడా శ్రీనివాసరెడ్డి అనుభవించినట్టు తెలిపారు. మరోవైపు స్థలాలు, పొలాల విక్రయం అనంతరం సకాలంలో రిజిస్ట్రేషన్లు చేయకుండా పార్టీలను వేధించేవాడని పేర్కొన్నారు. ఆయనకు రూ.కోటి మేర అప్పు ఉందని, అప్పిచ్చిన వారికి సైతం సకాలంలో చెల్లింపులు చేయకుండా వేధింపులకు గురిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. వివాహేతర సంబంధాల కారణంగా పలువురితో వివాదమున్నట్టు చెప్పారు. శ్రీనివాసరెడ్డి భార్య, కుమారుడు విజయవాడలో నివసిస్తుండగా, ఆయన మాత్రం భద్రిరాజుపాలెంలోనే ఉంటారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు పాత కక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులెవరో తేలుస్తామని వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని