ఏఆర్‌ కానిస్టేబుల్‌ బలవన్మరణం

వ్యక్తిగత జీవితంపై విరక్తి చెందిన ఓ కానిస్టేబుల్‌ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగో పట్టణ పోలీసుల వివరాల మేరకు..  నగరంలోని ఆజాద్‌నగర్‌కు చెందిన నాగరాజు, చౌడమ్మ దంపతుల కుమారుడు సురేష్‌

Updated : 25 Sep 2022 05:52 IST

సురేష్‌ (పాత చిత్రం)

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: వ్యక్తిగత జీవితంపై విరక్తి చెందిన ఓ కానిస్టేబుల్‌ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగో పట్టణ పోలీసుల వివరాల మేరకు..  నగరంలోని ఆజాద్‌నగర్‌కు చెందిన నాగరాజు, చౌడమ్మ దంపతుల కుమారుడు సురేష్‌ (33) జిల్లా ఏఆర్‌ విభాగంలో 2011 నుంచి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి 2018లో తన మేనమామ కూతురు మౌనికతో వివాహమైంది. కొన్ని నెలలు వైవాహిక జీవితం సవ్యంగా సాగినా.. అనంతరం వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్య పుట్టినిల్లయిన తిరుపతికి వెళ్లిపోయింది. ఆరు నెలల కిందట విడాకులు మంజూరయ్యాయి. అప్పటి నుంచి సురేష్‌ తన వైవాహిక జీవితం నాశనమైందంటూ తల్లిదండ్రులతో బాధపడేవాడు. దీంతో పాటు ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉండేది. ఈ ఏడాది జులై 21 నుంచి మెడికల్‌ లీవ్‌ తీసుకుని, రాంనగర్‌ పార్కు సమీపంలో ఓ అద్దెగదిలో ఉండేవాడు. రోజు మాదిరిగానే  శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో అల్పాహారం చేసి అద్దెగదికి వెళ్లాడు. అదే రోజు రాత్రి తండ్రి నాగరాజు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. శనివారం ఉదయం సైతం ఫోన్‌ చేయగా సమాధానం లేకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు అద్దె గదివద్దకు చేరుకుని పరిశీలించారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా సురేష్‌ సీలింగ్‌ ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవిలా కనిపించాడు. ఎస్సై గంగాధర్‌ ఘటనాస్థలికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.
పలు అనుమానాలు?
సురేష్‌ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల కిందట రాంనగర్‌లో గదిని అద్దెకు తీసుకుని, దాన్ని కార్యాలయంగా చేసుకుని షేర్‌మార్కెట్‌ వ్యాపారం నిర్వహించేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు. చున్నీతో ఉరి వేసుకోవడంతో ఆడవాళ్లు ధరించే చున్నీ గదిలోకి ఎలా వచ్చిందనే విషయంపైనా అనుమానాలు ఉన్నాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని