ఆ ఇంట్లో అమావాస్య చీకట్లు

పెద్దల పండగ రోజున ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సమస్యలతో ఇద్దరు పిల్లలతోపాటు ఓ తల్లి అనంత లోకాలకు వెళ్లిపోయింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుంఖఃసాగరంలోకి నెట్టింది. సమస్యను పరిష్కరించుకోలేక..

Updated : 26 Sep 2022 05:04 IST

ఆత్మహత్యకు పాల్పడిన తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యం

న్యూస్‌టుడే- మహబూబ్‌నగర్‌ నేర విభాగం, నవాబుపేట

విషణ్న వదనంతో బంధువుల వద్ద చిన్నారి నవ్య

పెద్దల పండగ రోజున ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సమస్యలతో ఇద్దరు పిల్లలతోపాటు ఓ తల్లి అనంత లోకాలకు వెళ్లిపోయింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుంఖఃసాగరంలోకి నెట్టింది. సమస్యను పరిష్కరించుకోలేక.. ఎవరికీ చెప్పుకోలేక ఆ మాతృమూర్తి కఠిన నిర్ణయం తీసుకుంది. పిల్లలతోపాటు చెరువులోకి వెళ్లి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది.

పచ్చని కాపురంలో కలతలు.. : మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపహాడుకు చెందిన మైబు, ఆయన భార్య రమాదేవి ముగ్గురు పిల్లలతో అన్యోన్యంగా ఉండేవారు. సొంతూళ్లో భర్త తాపీ మేస్త్రీ, భార్య కూలీ పనులు చేసుకునేవారు. నాలుగేళ్ల కిందట బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. పెద్ద కుమార్తె నవ్యను దేవరకద్ర కేజీబీవీలో చేర్చి కవల పిల్లలు మేఘన, మారుతిని వారి వద్ద ఉంచుకున్నారు. హైదరాబాదులో మేస్త్రీ పనులు చేస్తున్న భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గమనించిన భార్య పలుమార్లు హెచ్చరించింది. ఆయన మాత్రం పట్టించుకోలేదు. దీంతో రోజూ గొడవలు జరుగుతుండడంతో చావే శరణ్యమని భావించింది.

తమ్ముడు, చెల్లి మునిగిపోతున్నారమ్మా..: భర్తపై కోపంతో రమాదేవి ఇద్దరు పిల్లలను తీసుకొని శనివారం ఉదయం మహబూబ్‌నగర్‌కు, అక్కణ్నుంచి దేవరకద్రకు వెళ్లి పెద్ద పాపను వెంట తీసుకొచ్చింది. ఆమె వాడే సెల్‌ఫోన్‌ను హైదరాబాదులోని ఇంట్లోనే ఉంచింది. పిల్లలతోపాటు ఎక్కడికి వెళ్లిందనే విషయం భర్తకు తెలియరాదని ఇలా చేసింది. ముగ్గురు పిల్లలతోపాటు ఆర్టీసీ బస్సులో వచ్చి సొంతూరు కాకర్లపహాడు స్టేజీ సమీపంలో దిగింది. రహదారి గుండా కాకుండా వేరే మార్గంలో వెళుతుంటే పెద్ద పాప వారించింది. ‘అమ్మా.. ఇటు వైపు నుంచి ఎందుకు వెళుతున్నాం. మాకు భయమవుతోంది’ అని అంటుంటే.. అడ్డదారి గుండా త్వరగా పోదామని చెప్పిన తల్లి నల్లకుంట చెరువు వద్దకు తీసుకెళ్లింది. చెరువులోకి దిగుతుండగా.. నీళ్లను చూస్తే భయమవుతోందని పాప మరోసారి వెనకడుగు వేసింది. ఆ తల్లి మాత్రం ముగ్గురు పిల్లలతోపాటు నీటిలోకి వెళ్లింది. ‘అమ్మా... చెల్లి, తమ్ముడు నీళ్లలో మునిగిపోతున్నారు.. వారిని కాపాడు’ అంటుండగానే తల్లి మునిగిపోయింది. అక్క మెడను పట్టుకొని కొంత దూరం వచ్చాక చెల్లి మేఘన నీటిలోకి జారిపోయింది. దీంతో నవ్య కాళ్లు ఆడిస్తూ.. ముందుకు సాగింది. అక్కడున్న కంప చెట్టును పట్టుకుంది. ముళ్లు చేతికి గుచ్చుకున్నా.. వదలకుండా అలాగే ఉండిపోయింది. అంకుల్‌.. అంకుల్‌ అంటూ అరవడంతో కొద్దిసేపయ్యాక కొందరు అక్కడికి వచ్చి నవ్యను బయటకు తీశారు. అప్పటికే తల్లి, ఇద్దరు పిల్లలు గంగమ్మ ఒడికి చేరిపోయారు.

పోలీసుల అదుపులో భర్త..

భార్య, ఇద్దరు పిల్లలు మరణించారని సమాచారం అందుకున్న మైబు శనివారం రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి వచ్చాడు. పెద్ద పాప ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. ఆదివారం ఉదయం సొంతూరు కాకర్లపహాడ్‌కు వెళ్లాడు. అక్కడే భార్య తరఫు బంధువులు అతనిపై దాడి చేసే ప్రమాదముందని గుర్తించిన సర్పంచి నర్సింహులు, పెద్దలు అతన్ని నవాబ్‌పేట పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా సీఐ రాజేశ్వర్‌గౌడ్‌ను వివరణ కోరగా మైబును అదుపులోకి తీసుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యలకు కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని