ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు యువకుల దుర్మరణం

నారాయణపేట జిల్లాలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం అర్ధరాత్రి అనంతరం చోటుచేసుకొంది. బాధిత కుటుంబాల సభ్యులు, మరికల్‌

Updated : 26 Sep 2022 05:11 IST

పంచాయితీకి వచ్చి ఇద్దరు.. పెద్దల పండగకు వస్తూ మరొకరు

మరికల్‌ (ధన్వాడ), న్యూస్‌టుడే : నారాయణపేట జిల్లాలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం అర్ధరాత్రి అనంతరం చోటుచేసుకొంది. బాధిత కుటుంబాల సభ్యులు, మరికల్‌ ఎస్సై అశోక్‌బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మరికల్‌ మండలంలోని బుడ్డగాని తండాకు చెందిన యువకుడు వాడ్యా కిషన్‌ ఇంటికి సంబంధించిన విషయంలో వివాదం నడుస్తోంది. దీనిపై మాట్లాడటానికి పెద్దలు పంచాయితీ పెడదామని నిర్ణయించడంతో హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్లుగా పనిచేస్తున్న వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని చంద్రానాయక్‌ తండాకు చెందిన వాడ్యా రాజేష్‌ (19), నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలోని బండతండాకు చెందిన డేగావత్‌ రాహుల్‌ (21)ను సాయంగా రప్పించుకున్నాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో విందు చేసుకుందామని ముగ్గురు కలిసి మరికల్‌కు వచ్చారు. అక్కడ జాతీయ రహదారి పక్కన ఓ డాబాలో బిర్యానీ పొట్లాలు కట్టించుకొని లాల్‌కోట క్రాస్‌ రోడ్డు దిశగా ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. తీలేర్‌ శివారులో మహబూబ్‌నగర్‌ వైపు నుంచి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వాహనాలు నడుపుతున్న డేగావత్‌ రాహుల్‌, నవీన్‌కుమార్‌ (38) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా వాడ్య రాజేష్‌ మార్గమధ్యంలో మృతి చెందాడు. కిషన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

పెద్దలకు సాంబ్రాని వేయాలని..

నారాయణపేట పట్టణంలోని కలాల్‌వాడి సుభాష్‌రోడ్డు వీధికి చెందిన నవీన్‌కుమార్‌ అదే జిల్లాలోని ఊట్కూరు మండలం తిప్రాస్‌పల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మిని పెళ్లి చేసుకొని, భార్య, ఇద్దరు కుమార్తెలతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌ శివారులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల వాహన డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తల్లిదండ్రులు శనివారం పెద్దల పండుగ చేయడంతో ఆలస్యంగా అయినా పెద్దలకు సాంబాని వేద్దామని నవీన్‌కుమార్‌ విధులు ముగించుకొని షాద్‌నగర్‌ నుంచి రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అర్ధరాత్రి దాటాక తీలేర్‌ శివారులో జరిగిన దుర్ఘటనలో దుర్మరణం చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని