సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమిస్తా.. రూ.లక్ష కట్టండి: మాదాపూర్‌లో ఐటీ కంపెనీ పేరిట మోసం

ఐటీ ఉద్యోగాలిప్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ సంస్థ పేరిట ప్రకటనలు గుప్పించిన యువకుడు వందలాది మందిని నిలువునా ముంచాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేసి బోర్డు తిప్పేశాడు.

Updated : 27 Sep 2022 09:55 IST

ప్రతాప్‌ కట్టమూరి

ఈనాడు, హైదరాబాద్‌; మాదాపూర్‌, న్యూస్‌టుడే: ఐటీ ఉద్యోగాలిప్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ సంస్థ పేరిట ప్రకటనలు గుప్పించిన యువకుడు వందలాది మందిని నిలువునా ముంచాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. బాధితులే చాకచక్యంగా నిందితుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించగా చీటింగ్‌ కేసు నమోదు చేశారు. మంగళవారం రిమాండ్‌కు తరలించనున్నారు. బాధితుల్లో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు ఉన్నారు. నిందితుడు గతంలోనూ ఇలా కొందరిని మోసగించినట్లు  బాధితులు చెప్పారు.

రూ.30 వేల జీతమంటూ..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ప్రతాప్‌ కట్టమూరి(25) ఈ ఏడాది ఫిబ్రవరిలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో డాన్యన్‌ ఐటీ టెక్నాలజీ ప్రై.లిమిటెడ్‌ పేరిట సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఏర్పాటు చేశాడు. సంస్థకు తాను బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌నని ప్రచారం చేసుకున్నాడు. నియామకాలు చేపడుతున్నామని.. ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌ జాబ్స్‌ పేజీలో పోస్టు చేశాడు. సుమారు 200 మంది అతన్ని సంప్రదించారు. ఉద్యోగం కావాలంటే మూడు నెలల శిక్షణ తీసుకోవాలని.. తర్వాత ప్లేస్‌మెంట్‌ ఉంటుందని నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.1-1.50 లక్షల చొప్పున వసూలు చేశాడు. శిక్షణ కాలంలో నెలకు రూ.20 వేల చొప్పున భృతి.. ఉద్యోగం వచ్చాక రూ.30 వేల జీతం ఇస్తానని చెప్పాడు.

కొందరు ఆన్‌లైన్లో, మరికొందరు నేరుగా డబ్బు కట్టారు. అందర్నీ శిక్షణకు తీసుకున్నట్లు నమ్మించి, గూగుల్‌ మీట్‌లో తరగతులు నిర్వహించేవాడు. శిక్షణ ప్రారంభించి నెలలవుతున్నా భృతి చెల్లించలేదు. ఉద్యోగం ఇవ్వలేదు. అందరికీ వర్క్‌ ఫ్రం హోం అని చెప్పాడు. అనుమానం వచ్చి కొందరు నిలదీసినా స్పందించలేదు. కొందరికి మాత్రం రూ.6 వేల చొప్పున ఇచ్చి మిన్నకున్నాడు. మరికొందరు సెప్టెంబరు ఆరో తేదీన అయ్యప్ప సొసైటీలోని కార్యాలయానికి వెళ్లి ప్రతాప్‌తో గొడవకు దిగారు. ఈ సమయంలో నరసింహారెడ్డి అనే వ్యక్తి వచ్చి, తాను వైతెపా నాయకుడినని, వారం రోజులు ఆగాలని, కంపెనీని త్వరలో తాను స్వాధీనం చేసుకుంటానని, అక్టోబరు నుంచి ఉద్యోగం, వేతనాలు ఇస్తామంటూ చెప్పాడు. సెప్టెంబరు 20 దాటినా స్పదించలేదు. ఫోన్‌ చేస్తే.. ప్రతాప్‌ ఆచూకీ తెలియడంలేదని బదులిచ్చారు. బాధితులు సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. మాదాపూర్‌ ఠాణాకు పంపించారు. ప్రతాప్‌ను పట్టుకునేందుకు ప్రణాళిక వేసిన బాధితులు,  ఓ యువతితో ఫోన్‌ చేయించారు. డబ్బులిస్తామని చెప్పి నమ్మించి అసెంబ్లీకి ఎదురుగా పట్టుకున్నారు.

కేసు నమోదులో తాత్సారం
డబ్బు తీసుకుని పెద్దఎత్తున నిరుద్యోగుల్ని మోసం చేసినా పోలీసులు ఇంతవరకూ అరెస్టు చేయలేదని యూత్‌ కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. సోమవారం మాదాపూర్‌ స్టేషన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21 తేదీనే నిందితుడిని పోలీసులకు అప్పగించినా.. ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts