నీరు మింగింది.. కన్నీరు మిగిలింది

వర్షానికి గుంతలో చేరిన నీరు మూడు కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. లోతు తెలియక లోపలికి దిగిన ముగ్గురు చిన్నారులను ఆ కుంట మింగేసింది

Updated : 27 Sep 2022 04:59 IST

నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం

చిన్నారుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబీకులు

షాద్‌నగర్‌, షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: వర్షానికి గుంతలో చేరిన నీరు మూడు కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. లోతు తెలియక లోపలికి దిగిన ముగ్గురు చిన్నారులను ఆ కుంట మింగేసింది. ఈ విషాద ఘటన షాద్‌నగర్‌ పురపాలికలోని సోలీపూర్‌ గ్రామ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. సోలీపూర్‌కు చెందిన అక్షిత్‌గౌడ్‌(8), ఫరీద్‌(12), సయీఫ్‌(7), సంజయ్‌కుమార్‌ కలిసి గ్రామ శివారులోని ఓ వెంచర్‌ వద్దకు వెళ్లారు. రోడ్డు మరమ్మతులకు కావాల్సిన మట్టి కోసం వెంచర్‌లో మున్సిపాలిటీకి కేటాయించిన స్థలంలో భారీగా గుంతలు తవ్వారు. వర్షాలకు ఓ గుంత నీటితో నిండింది. ఈత కొడదామన్న ఆసక్తితో నలుగురు చిన్నారులు అందులోకి దిగారు. సంజయ్‌కుమార్‌ కొంచెం దూరం వెళ్లి భయమేసి వెనిక్కి వచ్చేశాడు. మిగతా ముగ్గురు నీటిలో పడి గిలగిల్లాడుతుండటంతో వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్థులకు చెప్పాడు. బాలుర కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన చేరుకొనేసరికే ముగ్గురూ నీటిలో మునిగి మృత్యు ఒడికి చేరారు. ఏసీపీ కుషాల్కర్‌, సీఐ నవీన్‌కుమార్‌ మృతదేహాలను బయటకు తీయించి షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. వెంచర్‌లో తవ్విన గుంతలే తమ పిల్లల ప్రాణాలు తీశాయని, తమకు న్యాయం కావాలని చిన్నారుల కుటుంబ సభ్యులు పట్టణ కూడలిలో, కమ్యూనిటీ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేలా చూస్తానని ఏసీపీ కుషాల్కర్‌, తహసీల్దార్‌ గోపాల్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కొత్త బట్టలు కావాలి నాన్నా..: దసరాకు కొత్తబట్టలు కావాలని ఉదయమే అక్షిత్‌గౌడ్‌ మారాం చేశాడని.. ఇంతలోనే ఇలా జరిగిందని తండ్రి భిక్షపతి వాపోయాడు. ఆయన ముగ్గురు కుమారుల్లో అక్షిత్‌ చిన్నవాడు.  
అన్నదమ్ముల ఇళ్లలో విషాదం: నయీమ్‌, సలీంలు సొంత అన్నదమ్ములు. నయీమ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్దకుమారుడు ఫరీద్‌ ఈ ఘటనలో కన్నుమూశాడు. సలీం దంపతులకు సయీఫ్‌తోపాటు కుమార్తె ఉండగా, కుమారుడు ఇదే ఘటనలో మృత్యువాత పడ్డాడు. దీంతో రెండు ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని