Hyderabad News: లేపేస్తామంటూ బెదిరిస్తే.. చంపేశారు!

భర్త వేధింపులు భరించలేని భార్య.. మేనమామతో చెప్పి లేపేస్తానంటూ చేసిన బెదిరింపు హత్యకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు కటకటాల పాలయ్యారు. మరో ట్విస్ట్‌ ఏమిటంటే.. మహారాష్ట్రలో హత్యాయత్నం కేసులో పారిపోయి

Updated : 27 Sep 2022 07:43 IST

ఈనాడు, హైదరాబాద్‌ న్యూస్‌టుడే, చార్మినార్‌: భర్త వేధింపులు భరించలేని భార్య.. మేనమామతో చెప్పి లేపేస్తానంటూ చేసిన బెదిరింపు హత్యకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు కటకటాల పాలయ్యారు. మరో ట్విస్ట్‌ ఏమిటంటే.. మహారాష్ట్రలో హత్యాయత్నం కేసులో పారిపోయి నగరంలో తలదాచుకుంటున్న నిందితుడూ పోలీసులకు చిక్కాడు. సోమవారం బహదూర్‌పుర ఠాణాలో చార్మినార్‌ ఏసీపీ భిక్షంరెడ్డి, బహదూర్‌పుర ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌తో కలసి దక్షిణ మండల డీసీపీ పి.సాయిచైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు.

పహడీషరీఫ్‌ నివాసి మహ్మద్‌ జుబేర్‌(38)పై రాజేంద్రనగర్‌ ఠాణాలో రౌడీషీట్‌ ఉంది. కొద్దిమంది యువకులను చేరదీసి ముఠా తయారు చేశాడు. 2014లో జరీనాబేగాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతుల మధ్య మనస్పర్థలున్నాయి. జరీనాబేగం మేనమామ మహ్మద్‌ బాబూఖాన్‌(38), జుబేర్‌ మధ్య వ్యాపార లావాదేవీల్లో గొడవలున్నాయి. వీరిద్దరూ పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్లుగా కొనసాగుతున్నారు. గతంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇద్దరి అనుచరులు హత్యకు గురయ్యారు. భర్త వేధింపులు భరించలేని జరీనాబేగం పుట్టింటికి చేరింది. భర్త ఫోన్‌చేసి వేధించటంతో తన మేనమామతో చెప్పి లోకంలో లేకుండా చేస్తానంటూ బెదిరించింది. దీన్ని మనసులో పెట్టుకున్న జుబేర్‌ ఈనెల 14న హస్సన్‌నగర్‌ సలీమా హోటల్‌ వద్ద ఉన్న బాబూఖాన్‌పై తన అనుచరులతో కలసి కత్తులు, ఇనుప పైపులతో దాడి చేసి హతమార్చారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బహదూర్‌పుర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తలదాచుకునేందుకు వచ్చి చిక్కాడు..

మహారాష్ట్రలోని అమరావతికి చెందిన రాహుల్‌ రాజు తడాస్‌(24) ఈ కేసులో రెండో నిందితుడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అక్కడ ఓ వ్యక్తిపై దేశవాళీ తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని హైదరాబాద్‌ చేరాడు. తనకున్న పరిచయాలతో జుబేర్‌ ముఠాలో చేరాడు. బాబుఖాన్‌ హత్య కేసు దర్యాప్తులో భాగంగా రాహుల్‌రాజు నేరచరిత్ర వెలుగుచూసింది. ఈ కేసులో మహ్మద్‌ జుబేర్‌(38), రాహుల్‌రాజు తడార్‌(24), మహ్మద్‌ ఓమర్‌ఖాన్‌(35), మహ్మద్‌ ఉస్మాన్‌(34), మహ్మద్‌ ఖదీర్‌(38), మహ్మద్‌ ఇమ్రాన్‌(36)లను అరెస్ట్‌ చేశారు. 4 కత్తులు, 2 దేశవాళీ పిస్తోళ్లు, 6 బుల్లెట్లు, ఆటో, ద్విచక్రవాహనం, 6 మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts