ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అశ్వారావుపేట పోలీసులు అరెస్టుచేసి వారి నుంచి రూ.2.46 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశ్వారావుపేట సీఐ బాలకృష్ణ

Updated : 28 Sep 2022 05:06 IST

రూ.2.46 లక్షల సొత్తు స్వాధీనం

దొంగల వివరాలను వెల్లడిస్తున్న సీఐ బాలకృష్ణ

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అశ్వారావుపేట పోలీసులు అరెస్టుచేసి వారి నుంచి రూ.2.46 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశ్వారావుపేట సీఐ బాలకృష్ణ ఆ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన చింతలపూడి యశ్వంత్‌ కుమార్‌ కొంతకాలంగా అశ్వారావుపేటలోనే ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరు జిల్లా నల్లబాడు మండలం గుజ్జనగుళ్ల గ్రామానికి చెందిన బత్తుల వెంకటరావూ ఆటో డ్రైవరే. వీరిద్దరు గతంలో వేర్వేరుగా దొంగతనాలకు పాల్పడి ఏలూరు జైలుకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ స్నేహితులయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలసి తెలుగు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 10న అశ్వారావుపేటలోని కోనేరు బజారులో నివాసం ఉంటున్న గంపల ప్రకాశ్‌ ఇంట్లో, ఈ నెల 11న అశ్వారావుపేటలోని గుర్రాచెరువు రహదారిలో తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్న సంక్రాంతి దుర్గాప్రసాద్‌ ఇంట్లో చోరీ చేసి బంగారు ఆభరణాలను అపహరించారు. వీరు మంగళవారం తెల్లవారు జామున ఎస్సై సాయికిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు అనుమానాస్పద రీతిలో దొరికారు. వీరి వద్ద బంగారు, వెండి ఆభరణాలు లభించడంతోపాటు విచారణలో వీరే చోరీలకు పాల్పడినట్లు తేలింది. నిందితులిద్దరినీ అరెస్టు చేసి వీరి నుంచి 70 గ్రాముల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు అరుణ, సాయికిశోర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని