సీసీ కెమెరాల్లో గుర్తించి.. 12 గంటల్లో ఛేదించి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారి మంచుకొండ జగదీశ్‌ బైక్‌పై వెళ్తూ పోగొట్టుకున్న నగదు రూ.11 లక్షలు సీసీ కెమెరాల ఆధారంగా 12 గంటల్లో స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వై.వెంకటేశ్వర్రావు తెలిపారు.

Updated : 30 Sep 2022 05:57 IST

వ్యాపారి పోగొట్టుకున్న రూ.11లక్షల అప్పగింత


కేసు వివరాలు తెలుపుతున్న మిర్యాలగూడ డీఎస్పీ వై. వెంకటేశ్వర్రావు

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారి మంచుకొండ జగదీశ్‌ బైక్‌పై వెళ్తూ పోగొట్టుకున్న నగదు రూ.11 లక్షలు సీసీ కెమెరాల ఆధారంగా 12 గంటల్లో స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వై.వెంకటేశ్వర్రావు తెలిపారు. మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలియజేశారు. ఈ నెల 27న రాత్రి బియ్యం వ్యాపారి మంచుకొండ జగదీశ్‌ ఎంపీడీవో కార్యాలయం నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీ వైపు బైక్‌పై వెళుతున్నారు. బైక్‌కు రెగ్జిన్‌ బ్యాగు తగిలించుకుని అందులో నగదు తీసుకుని వెళుతున్నారు. ఖమ్మం రహదారిలో ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా రాగానే వేగ నియంత్రణకు తగిలి సంచి జారి కింద పడింది. ఇంటికి వెళ్లిన తరువాత బ్యాగు కనిపించకపోగా వెంటనే ఒకటో పట్టణ సీఐ రాఘవేందర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐ నేర విభాగం ఎస్సై సుధీర్‌కుమార్‌ బృందంతో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల పరిశీలనలో బ్యాగు మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన ఇంద్రపల్లి వెంకటేశ్వర్లు అతని బావమరిది నాగరాజు కలిసి తీసుకున్నట్లు గుర్తించారు. ఆటో నెంబరు ఆధారంగా అతని ఇంటికి వెళ్లి పోలీసులు తనిఖీ చేశారు. మొదట బుకాయించినా బీరువా కింద భాగంలో దాచి ఉంచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇంద్రపల్లి వెంకటేశ్వర్లు, నాగరాజుపై కేసు నమోదు చేసి నగదు కోర్టుకు స్వాధీనం చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ పి.రాఘవేందర్‌, ఎస్సై సుధీర్‌కుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌ రవి, వెంకటేశ్వర్లు, రామకృష్ణలను డీఎస్పీ అభినందించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని