జల్సాలకు అలవాటుపడి చోరీలు

ఎనిమిది మంది యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. వీటికోసం ఎలాగైనా డబ్బులను సంపాదించాలనే ఉద్దేశంతో చోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతూ ఖమ్మం పోలీసులకు చిక్కారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన 28 చోరీ కేసుల్లో ఎనిమిది మంది నిందితులను

Updated : 01 Oct 2022 05:54 IST

ఎనిమిది మంది నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌, చిత్రంలో ఏసీపీలు ఆంజనేయులు, రవి,

ప్రసన్నకుమార్‌, స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఎనిమిది మంది యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. వీటికోసం ఎలాగైనా డబ్బులను సంపాదించాలనే ఉద్దేశంతో చోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతూ ఖమ్మం పోలీసులకు చిక్కారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన 28 చోరీ కేసుల్లో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ వివరించారు. నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులతో పాటు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, నగదు వివరాలు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ముస్తఫానగర్‌లో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే సమాచారంతో ఖమ్మం ఒకటోపట్టణ పోలీసులు, సీసీఎస్‌ పోలీసులు నిందితులు సూర్యాపేట జిల్లా నడిగూడెం కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన నూకమళ్ల నాగేంద్రబాబు, పప్పుల రాజ్‌కుమార్‌ అలియాస్‌ పండు, బాదే నాగేంద్రబాబు, మండల అశోక్‌, బాణాల ముత్యాలు, చింతమల్ల వెంకన్న, కులకులపల్లి మహేశ్‌తో పాటు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన తెలగమల్ల వెంకటేశ్వర్లు అలియాస్‌ రవిలను అదుపులోకి తీసుకొని విచారించారు. జల్సాలకు అలవాటు పడిన వీరు నేరప్రవృత్తిని ఎంచుకొని పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. దొంగిలించిన బంగారాన్ని వీరి వద్ద నుంచి కొనుగోలు చేసిన గాంధీచౌక్‌లోని జ్ఞానేశ్వరి బంగారం దుకాణానికి చెందిన ఎలబోయిన కృష్ణనూ నిందితుడిగా చేర్చినట్లు సీపీ తెలిపారు. వీరు ఖమ్మం నగరంలో 27 ఇళ్లలో, సూర్యాపేట జిల్లాలో 1 ఇంటిలో బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు చోరీ చేశారు. దొంగిలించిన డబ్బుతో నూకమళ్ల నాగేంద్రబాబు, పప్పుల రాజ్‌కుమార్‌ గోవా, విశాఖపట్నం ప్రాంతాల్లో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపారు.

రూ.42 లక్షల విలువైన సొత్తు రివకరీ: గత రెండేళ్లలో ఒకటో పట్టణ ఠాణా పరిధిలో 15, ఖానాపురం హవేలి ఠాణా పరిధిలో 10, ఖమ్మం రెండో పట్టణ ఠాణా పరిధిలో 2 ఇళ్లలో, సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీసు ఠాణా పరిధిలో ఒక ఇంటిలో చోరీలు చేశారు. నిందితుల నుంచి 638 గ్రాముల బంగారు నగలు, 2 కిలోల వెండి, 10 ఎల్‌ఈడీ టీవీలు, 3 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి విలువ సుమారుగా రూ.42లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఇటీవల టీఎన్జీవోస్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని దేవాలయంలో జరిగిన చోరీలో నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని చట్టం ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా మేముసైతం కార్యక్రమంలో భాగస్వాములై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీలు రవి, ఆంజనేయులు, ప్రసన్నకుమార్‌, సీఐలు మల్లయ్యస్వామి, నవీన్‌, చిట్టిబాబు, శ్రీధర్‌, సర్వయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని