మూడుముళ్ల బంధం.. అనుమానంతో అంతం

సమీప గృహాల్లో ఉండే వారిద్దరూ కులాలు వేరైనా పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.  కొంతకాలంపాటు అన్యోన్యంగా సాగిన వారు అంతలోనే దూరమయ్యారు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో ఆమెను అంతం చేశాడు.

Updated : 03 Oct 2022 05:33 IST

భార్యను హత్య చేసిన భర్త

విజయలక్ష్మి (పాతచిత్రం)

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: సమీప గృహాల్లో ఉండే వారిద్దరూ కులాలు వేరైనా పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.  కొంతకాలంపాటు అన్యోన్యంగా సాగిన వారు అంతలోనే దూరమయ్యారు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో ఆమెను అంతం చేశాడు. సత్తెనపల్లిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణ సీఐ శోభన్‌బాబు వివరాల మేరకు.. అచ్చంపేట రోడ్డులోని రైల్వేగేటు అవతల రోడ్డు పక్కనే ముఠాకూలీ పసుపులేటి నాగరాజు, చిన్నం విజయలక్ష్మి కుటుంబాలు ఉంటున్నాయి. నాగరాజు, విజయలక్ష్మి(40) ప్రేమించుకుని 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారి వివాహ బంధం కొంతకాలం బాగానే ఉంది. భార్యపై అనుమానం రావడంతో ఐదారేళ్లుగా మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం వారిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో నాగరాజు తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా విజయలక్ష్మి ఇంట్లోనే కుట్టుమిషన్‌ పెట్టుకుని కుమార్తె మీనాక్షిని చదివించుకుంటూ జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం దంపతుల మధ్య సయోధ్య కుదరడంతో మళ్లీ కలిసి ఉంటున్నారు. అయితే భార్య వివాహేతర సంబంధం నెరుపుతోందనే కారణంతో అతడు గొడవపడి నాలుగు నెలలుగా మళ్లీ భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు విడాకులు ఇవ్వాలని భార్య ఇటీవల నోటీసు పంపడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం భార్య వద్దకు వెళ్లగా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇనుప బద్దతో విజయలక్ష్మి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి హత్యతో ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె మీనాక్షి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నాగరాజు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. హతురాలి సోదరి నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని