ప్రాణం తీసిన స్వీయచిత్రాల మోజు

తణుకు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు యువకుల నిర్లక్ష్యం బీభత్సాన్ని సృష్టించింది. స్వీయ చిత్రాలు తీసుకుంటూ కారు నడపడంతో అది జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.

Updated : 03 Oct 2022 05:57 IST

జనంపైకి దూసుకెళ్లిన కారు

ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

ప్రమాదానికి కారణమైన కారు

తణుకు, న్యూస్‌టుడే: తణుకు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు యువకుల నిర్లక్ష్యం బీభత్సాన్ని సృష్టించింది. స్వీయ చిత్రాలు తీసుకుంటూ కారు నడపడంతో అది జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన కోడిగుడ్లు ఎగుమతి చేసే వ్యాపారి సబీర్‌ హుస్సేన్‌కు చెందిన కారులో అతని కుమారుడు సయ్యన్‌ హుస్సేన్‌, స్నేహితులు వడ్డి సాయిపవన్‌ ఫణేంద్ర (తాడేపల్లిగూడెం), ఆముదాలపల్లి శశికిరణ్‌ (వేల్పూరు) బయటకు వచ్చారు. చరవాణుల్లో స్వీయచిత్రాలు తీసుకుంటుండగా సొసైటీ రోడ్డులో కారు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లి వైఎస్సార్‌ పార్కు గోడను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెలకు చెందిన నంబూరి వీరబాబు (65), పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద వాచ్‌ మ్యాన్‌గా పని చేస్తున్న శీల శ్రీను, ఆయన కుమార్తె నాగసత్యదుర్గాభవానీ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. వీరబాబు చికిత్స పొందుతూ మృతిచెందారు. శ్రీను, భవానీ చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో సయ్యన్‌ హుస్సేన్‌ కారు నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు.

వీరబాబు (పాత చిత్రం)

పూజలు చేయడానికి వచ్చి.. తూర్పుగోదావరి జిల్లా పలివెల గ్రామానికి చెందిన వీరబాబు కుటుంబసభ్యులు బంధువులతో కలిసి ఆదివారం ఉదయం వీరభద్రస్వామికి పూజలు చేయడానికి తణుకు వచ్చారు. ఈ క్రమంలో పానకాల కావిడిని మోయడానికి పట్టణానికి చెందిన శీల శ్రీనును పురమాయించుకున్నారు. అతను పానకాల కావిడితో నడుస్తుండగా.. నాగసత్యదుర్గాభవానీ తండ్రిని అనుసరిస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వెనుక నుంచి కారు వీరిపైకి దూసుకొచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సయ్యన్‌ హుస్సేన్‌ అక్కడి నుంచి పరారీ కాగా.. సాయిపవన్‌ ఫణీంద్ర, శశికిరణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని