జైల్లో పరిచయాలు.. చోరీ సొత్తుతో జల్సాలు

జల్సాలకు అలవాటుపడిన నేరస్థులు ముఠాగా ఏర్పడ్డారు. చోరీ సొత్తును తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో విలాస జీవనం గడిపేవారు. దొంగతనాల తీరు, ఆభరణాలు నగదుగా మార్చుకోవడం సినీఫక్కీలో జరుగుతున్న వైనం చూసి పోలీసులు అవాక్కయ్యారు.

Updated : 04 Oct 2022 05:40 IST

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వినీత్‌

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: జల్సాలకు అలవాటుపడిన నేరస్థులు ముఠాగా ఏర్పడ్డారు. చోరీ సొత్తును తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో విలాస జీవనం గడిపేవారు. దొంగతనాల తీరు, ఆభరణాలు నగదుగా మార్చుకోవడం సినీఫక్కీలో జరుగుతున్న వైనం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఆయా వివరాలను కొత్తగూడెం డీఎస్పీ జి.వెంకటేశ్వరబాబు, మూడో పట్టణ ఠాణా ఎస్‌హెచ్‌ఓ ఎం.అబ్బయ్యలతో కలిసి ఎస్పీ వినీత్‌ సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. కొత్తగూడెం కూలీలైన్‌కు చెందిన షేక్‌ ఇర్ఫాన్‌ అలియాస్‌ చోటుకు చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసే అలవాటు ఉంది. 2012లో గాయత్రి ఆసుపత్రిలో ఫోన్‌ దొంగతనం చేసి బాల నేరస్థుడిగా ఖమ్మం చిల్డ్రన్‌ హోంలో గడిపాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా పలు ఆసుపత్రుల్లో విలువైన సెల్‌ఫోన్లు మాయం చేశాడు. ఈ ఏడాది మే నెలలో కొత్తగూడెం వన్‌టౌన్‌ పరిధిలో ఓ ఇంట్లో చోరీ చేసి భద్రాచలం జైలుకెళ్లాడు. ఆ సమయంలో పోక్సో కేసు నిందితుడైన విజయ్‌, పాల్వంచకు చెందిన మరో దొంగ చల్లా వెంకట్‌లతో పరిచయం ఏర్పడింది. వారు బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు తెగబడ్డారు.

జూన్‌లో ఇర్ఫాన్‌, వెంకట్‌లు వన్‌ టౌన్‌లో మూడుచోట్ల చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వాటిల్లో కొన్ని విజయ్‌కి ఇవ్వగా.. అతడు భద్రాచలంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి నగదు తెచ్చి ఇచ్చాడు. ఎవరి వాటాలు వారు పంచుకోగా.. తనకు వచ్చిన రూ.50 వేలను సోదరి జి.వసంతకు వెంకట్‌ ఇచ్చాడు. తర్వాత ఇల్లెందుకు చెందిన బాల్య మిత్రుడు అజీమ్‌తో జతకట్టిన ఇర్ఫాన్‌ త్రీటౌన్‌ పరిధిలోని గాజులరాజం బస్తీ, గణేశ్‌ టెంపుల్‌ ఏరియాల్లో పలు ఇళ్లలో బంగారు నగలు చోరీ చేశాడు. సొత్తును హైదరాబాద్‌లో ఓ ‘ఈ-కామర్స్‌’ సంస్థ డెలివరీ బాయ్‌గా పనిచేసే అజీమ్‌ అక్కడి మణప్పురం సంస్థలో తాకట్టు పెట్టాడు. వచ్చిన డబ్బులతో నిందితులు మైసూరు, వైజాగ్‌ వంటి పర్యాటక కేంద్రాలకు వెళ్లి విలాస జీవితాన్ని గడిపేవారు. ఇటీవల కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఇర్ఫాన్‌, అజీమ్‌లు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 78 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు సెల్‌ఫోన్లు, రూ.లక్ష నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఫైనాన్స్‌ సంస్థల నుంచి మరో 81 గ్రాముల బంగారు నగలను రికవరీ చేయాల్సి ఉందని, చోరీకి గురైన రూ.13 లక్షల సొత్తుతో రూ.9.44 విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ఇద్దరిని జ్యుడిషియల్‌ రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపర్చామన్నారు. మిగిలిన ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు వినీత్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని