మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

ఇప్పుడిప్పుడే నూనూగు మీసాలు వస్తున్న ఆ విద్యార్థులంతా స్నేహితులు. పేదరికం కావడంతో వీలైనప్పుడల్లా వివిధ వేడుకలకు పూల డెకరేషన్‌ చేయడం, క్యాటరింగ్‌ పనులు వంటివి చేస్తుంటారు.

Updated : 05 Oct 2022 05:03 IST

అజిత్‌సింగ్‌నగర్‌లో విషాద ఛాయలు

శాంతినగర్‌లో వివరాలు సేకరిస్తున్న పోలీసులు

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే: ఇప్పుడిప్పుడే నూనూగు మీసాలు వస్తున్న ఆ విద్యార్థులంతా స్నేహితులు. పేదరికం కావడంతో వీలైనప్పుడల్లా వివిధ వేడుకలకు పూల డెకరేషన్‌ చేయడం, క్యాటరింగ్‌ పనులు వంటివి చేస్తుంటారు. సరదాగా బాపట్లలోని సూర్యలంక బీచ్‌కు వెళ్దాం అనుకున్నారు. ఇంట్లో చెబితే ఒప్పుకుంటారో లేదో అనో లేక.. భయమో తెలియదు గానీ.. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దసరా ఉత్సవాలకని, మరికొందరు క్రికెట్‌ ఆడుకోవడానికని, మరి కొందరు ఫ్రెండ్‌ బంధువుల ఇంట్లో వేడుకకు వెళుతున్నాం.. వంటి కారణాలు చెప్పి 8 మంది స్నేహితులు మంగళవారం వేకువజామునే తమ తమ ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. ఉదయం 6 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌కు  చేరుకున్నారు. రైలులో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో దిగిన కొద్దిసేపటికే.. అలల తాకిడికి ఆరుగురు గల్లంతయ్యారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జాలర్లు మరో ఇద్దర్ని కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా అజిత్‌సింగ్‌నగర్‌ పైపులరోడ్డు సమీపంలోని శాంతినగర్‌, కృష్ణాహోటల్‌సెంటరు శివాలయం ప్రాంత వాసులు కావడంతో.. తీవ్ర విషాదం నెలకొంది.

అజిత్‌సింగ్‌నగర్‌ పైపులరోడ్డు సమీపంలోని శాంతినగర్‌ మసీదు పరిసర ప్రాంతానికి చెందిన చింతల సాయిప్రణదీప్‌ అలియాస్‌ సిద్ధూ (17), బాజం అభిలాష్‌ అలియాస్‌ అభి(18), సర్వసుద్ధి వెంకట ఫణికుమార్‌(14), ప్రభుదాస్‌ (17), చందాల కైలాస్‌(13), పరిశుద్ధ వసంత(17), కృష్ణా హోటల్‌ సెంటరు శివాలయం వీధుల్లో నివాసముంటున్న నల్లాపు రాఘవ(18), చెరుకూరి సాయిమధు(17)లు కలిసి సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. కైలాస్‌, పరిశుద్ధ వసంతలు ఒడ్డునే ఆడుకుంటుండగా.. మిగిలిన వారంతా లోపలికి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో చింతల సాయిప్రణదీప్‌(సిద్దూ), బాజం అభిలాష్‌ (అభి), చెరుకూరి సాయిమధు(17) మృతిచెందారు. వెంకట ఫణికుమార్‌, ప్రభుదాస్‌, రాఘవల జాడ తెలియలేదు. ఒడ్డున ఆడుకుంటున్న కైలాష్‌, పరిశుద్ధ వసంతలు సైతం అలల తాకిడికి కొట్టుకుపోతుండటంతో జాలర్లు గుర్తించి రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.


అందరూ పేద కుటుంబాలకు చెందిన వారే... బీచ్‌కు వెళ్లిన వారందరూ పేద కుటుంబాలకు చెందిన వారే. వేడుకలకు ఈవెంట్‌లు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. చెరుకూరి సీత, అంజయ్య దంపతుల కుమారుడు సాయిమధు పదో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి కత్తులకు సానపెట్టి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు.

బాజం అభిలాష్‌.. పదో తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి ఏసురత్నం బీరువా కంపెనీలో కార్మికుడు. ఇంట్లో పెద్దవాడైన అభిలాష్‌ అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి.. చేదోడు-వాదోడుగా ఉంటాడని ఆశిస్తున్న సమయంలో.. అనుకోని రీతిలో మృత్యుఒడిలోకి చేరడంతో కుటుంబసభ్యుల రోదనకు అంతులేకుండా పోయింది.

మృత్యుఒడిలోకి చేరిన చింతల సాయిప్రణదీప్‌(సిద్ధూ).. గుడ్లవల్లేరులో ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది చదువుతున్నాడు. తల్లిదండ్రులు భవానీ, రమేష్‌లకు ఇద్దరు సంతానం. రమేష్‌ పండ్ల మార్కెట్‌లోని ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.

చనిపోయిన సిద్ధూ, గల్లంతైన ఫణికుమార్‌లు సమీప బంధువులు. వరుసకు అన్నాదమ్ములు. మృతదేహాలను మంగళవారం రాత్రి అజిత్‌సింగ్‌నగర్‌కు తీసుకొచ్చారు. తహసీల్దార్‌ చందన దుర్గా ప్రసాద్‌ నివాళి అర్పించారు.


గల్లంతైన వారి నేపథ్యం..

గల్లంతైన వారిలో ఫణికుమార్‌ స్థానికంగా అక్షర నందన పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇతని తండ్రి త్రినాధ్‌ పాదరక్షల తయారీ కంపెనీలో పనిచేస్తుంటారు.

ప్రభుదాస్‌ తండ్రి వెంకటేశ్వర్లు డోర్‌ మ్యాట్‌లు తయారు చేస్తుంటారు. తల్లి ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నారు. పదో తరగతి తప్పిన ప్రభుదాస్‌ సైతం ఇంటి ఆర్థిక అవసరాల రీత్యా అప్పుడప్పుడూ కేటరింగ్‌ పనులకు వెళుతుంటాడు.

రాఘవ.. ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో చేరి, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చదువు మానేశాడు. తల్లి లలిత ఇంటి పని కార్మికురాలు. తండ్రి సూరిబాబు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం కాగా రాఘవ చిన్నకుమారుడు.

ప్రాణాలతో బయటపడిన కైలాస్‌ 7వ తరగతి చదువుతున్నాడు. పరిశుద్ధ వసంత పదో తరగతి చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు.

చివరి సందేశం... బాపట్ల బీచ్‌కు బయలుదేరిన ఈ ఎనిమిది మంది మిత్రులు.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైలు బయల్దేరగానే బాయ్‌..బాయ్‌ బెజవాడ అంటూ ఇతర మిత్రులకు వాట్సప్‌ సందేశాలు పంపారు. అనుకోని దుర్ఘటన చోటుచేసుకోవడంతో... కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని