పండుగ పూట విషాదం

‘ఇదిగోరా.. ఇక్కడే ఈ నీటి గుంతలోనే.. నా చేతులతో ఇంట్లో పిండితో చేసిన గణేశుడిని నిమజ్జనం చేసిన..’ అని దోస్తులకు చూపుతూ బాలుడు సంబరంగా చెబుతుండగానే ప్రమాదవశాత్తు పడిపోయాడు. నీటి గుంతలో పడిపోయిన తమ్ముడిని రక్షించుకునేందుకు అక్క దూకగా తానూ చనిపోయింది.

Updated : 07 Oct 2022 02:45 IST

నీటి గుంతలో పడి అక్కాతమ్ముడి మృతి

చందన, రితిక్‌

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: ‘ఇదిగోరా.. ఇక్కడే ఈ నీటి గుంతలోనే.. నా చేతులతో ఇంట్లో పిండితో చేసిన గణేశుడిని నిమజ్జనం చేసిన..’ అని దోస్తులకు చూపుతూ బాలుడు సంబరంగా చెబుతుండగానే ప్రమాదవశాత్తు పడిపోయాడు. నీటి గుంతలో పడిపోయిన తమ్ముడిని రక్షించుకునేందుకు అక్క దూకగా తానూ చనిపోయింది. దసరా పండుగ రోజు ఈ విషాదం సిద్దిపేట అర్బన్‌ మండలం వెల్కటూరులో చోటుచేసుకుంది. ఇంటి వెలుగులు ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీరని శోకం అలుముకుంది. వెల్కటూరుకు చెందిన కాటపాక రాజు-కీర్తనకు చందన(9), రితిక్‌(7) ఇద్దరు పిల్లలున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిన్నారులు స్థానిక ప్రాథమిక పాఠశాలలో 4, 2వ తరగతులు చదువుతున్నారు. పండుగ పూట ఇంట్లో అమ్మ పిండి వంటలు చేస్తోంది. గోధుమ పిండితో వినాయకుడి ప్రతిమను రితిక్‌ తయారు చేశాడు. దానిని ఇంటికి సమీపంలో ఉండే నీటి గుంతలో నిమజ్జనం చేసి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటికి అతడి స్నేహితులు వచ్చి మాట్లాడగా గణేశుడిని తయారుచేసి, నిమజ్జనం చేసిన విషయాన్ని బాలుడు చెప్పాడు. ఎక్కడ, ఎలా చేశావని మిత్రులు అడగ్గా చూపిస్తానని.. సోదరితో కలిసి మళ్లీ గుంత వద్దకు వచ్చాడు. నిమజ్జనం చేసిన తీరును దోస్తులకు వివరిస్తుండగానే నీటి గుంతలో పడిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు అక్కడ నీటిలోకి దూకగా గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ బయటకు రాలేకపోయారు. మిత్రులు వెంటనే పరుగెత్తుకెళ్లి కుటుంబీకులకు చెప్పారు. స్థానిక వ్యక్తి ఒకరు వచ్చి కుంటలో దిగి చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించాడు. రితిక్‌ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కొన ఊపిరితో ఉన్న చందనను మిట్టపల్లి శివారులో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాళ్లను కొట్టేందుకు భూమి నుంచి పెద్ద బండరాయిని కొన్నేళ్ల క్రితం తవ్వి తీసేయడంతో గొయ్యి ఏర్పడి వాన నీటితో నిండి, ప్రమాదకారకమైంది. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం వచ్చి పరామర్శించింది. ఈ విషయమై పట్టణ మూడో ఠాణాలో సంప్రదించగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని, కేసు నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.


స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు..

వట్‌పల్లి, న్యూస్‌టుడే: కుటుంబీకులు, గ్రామస్థులు దసరా వేడుకల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో స్నానం చేసేందుకు నీటి కుంటలోకి దిగి యువకుడు మృతిచెందాడు. ఎస్సై అంబార్య తెలిపిన వివరాలు.. మండలంలోని పోతులబొగుడ గ్రామానికి చెందిన చిత్రాల మశ్చేందర్‌ (35) గ్రామ శివారులోని కుంట వద్దకు బుధవారం స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశత్తు నీటిలో మునిగి మరణించాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలోని స్నేహతులు, బంధువుల వద్ద ఆరా తీశారు. స్థానిక కుంట వద్దకు వెళ్లి చూడగా గుట్టుపై మశ్చేందర్‌ చెప్పులు కనిపించాయి. రాత్రి వరకు ఈతగాళ్లతో గాలించిన ఆచూకీ దొరకలేదు. గురువారం మృతదేహం పైకి తేలి కనిపించడంతో వెలికి తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పండగ పూట విషాదం నెలకొనడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు