నమ్మించి.. నట్టేట ముంచి..

ఒకప్పుడు దొంగలంటే జేబులోని పైసలు.. ఒంటిపై నగలు, తాళం వేసిన ఇంట్లో వస్తువులు దోచేవారు. ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో నేరాల రూటు మార్చారు. సైబర్‌ నేరగాళ్లు కంటికి కనిపించకుండా బ్యాంకు ఖాతాల్లోని నగదు కొల్లగొడుతున్నారు. ఒకప్పుడు మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా నేరాలు ఇప్పుడు మారుమూల గ్రామాలకు పాకింది. సాంకేతికతపై అవగాహన లేనివారిని లక్ష్యంగా చేసుకుని దోపిడికీ పాల్పడుతున్నారు.

Updated : 07 Oct 2022 04:55 IST

 పెరుగుతున్న సైబర్‌ మోసాలు

పల్లెల్లోనూ వెలుగు చూస్తున్న కేసులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఒకప్పుడు దొంగలంటే జేబులోని పైసలు.. ఒంటిపై నగలు, తాళం వేసిన ఇంట్లో వస్తువులు దోచేవారు. ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో నేరాల రూటు మార్చారు. సైబర్‌ నేరగాళ్లు కంటికి కనిపించకుండా బ్యాంకు ఖాతాల్లోని నగదు కొల్లగొడుతున్నారు. ఒకప్పుడు మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా నేరాలు ఇప్పుడు మారుమూల గ్రామాలకు పాకింది. సాంకేతికతపై అవగాహన లేనివారిని లక్ష్యంగా చేసుకుని దోపిడికీ పాల్పడుతున్నారు.

ఆశల వల

మోసాలకు పాల్పడేవారు మొదట ప్రజల అవసరాలు.. బ్యాంకు ఖాతాలు.. ఇంటర్‌నెట్‌ వినియోగ వివరాలు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా నమ్మించి నిండా ముంచుతున్నారు. ఇటీవల జిల్లా ఉన్నతాధికారుల వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు అడిగిన ఉదంతాలున్నాయి.

జాగ్రత్తలు తప్పనిసరి

చరవాణులకు వచ్చే అనవసరమైన సందేశాలకు స్పందించొద్దు. తెలియని లింకులు తెరవొద్దు. 

* సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయమైన ప్రకటనల లింకులు నొక్కితే మనకు తెలియకుండానే ఫోన్‌లోని పూర్తి సమాచారం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

* సురక్షితం కాని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు.

* ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పొదు.

* మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే సైబర్‌ క్రైం నంబరు 1930కి ఫోన్‌ చేయాలి. 

ఎన్నో ఉదంతాలు ...

కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని నర్సన్నపల్లికి చెందిన రాజు పేమెంట్‌ బ్యాంకు సర్వీసు పాయింట్‌ నిర్వహిస్తున్నారు. బయోమెట్రిక్‌ పరికరం గడువు ముగిసిందని గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. రూ.300 చెల్లించేందుకు ఏటీఎం కార్డును స్కాన్‌ చేసి పంపమన్నారు. అనంతరం విడతల వారీగా ఆయన ఖాతా నుంచి రూ.24,200 డ్రా చేసుకున్నాడు.

* బీబీపేట మండలం ఇస్సానగర్‌కు చెందిన కర్రోల్ల రమేష్‌ ఈ-కామర్స్‌ సంస్థలో కారు కొనుగోలు చేసేందుకు అభ్యర్థన పెట్టుకోగా.. సైబర్‌ నేరగాళ్లు మాయమాటలతో దోచుకున్నారు. ఇంటికే కారు తెచ్చిస్తామని రవాణా ఖర్చులకు రూ.2 వేలు వసూలు చేశారు. మరునాడు దారిలో ఆగిపోయామని నమ్మించి రూ.14,800, రూ.7200 రాబట్టారు. మరింత పంపాలని కోరగా అనుమానం వచ్చి బాధితుడు సైబర్‌క్రైంకు ఫిర్యాదు చేశారు.

* రాజంపేట మండలం ఆర్గోండకు చెందిన కుమ్మరి అజయ్‌ టెలిగ్రామ్‌ యాప్‌లో సీవోవోఈలో చేరి ఈమెయిల్‌ ఐడీ, చరవాణి నంబరు, ఓటీపీ నమోదు చేసి ఆటలో దిగారు. గేమింగ్‌ క్లబ్‌లో చేరి రూ.వంద, రూ.వెయ్యి అంటూ ఏకంగా రూ.1.13 లక్షలు పోగొట్టుకున్నారు.

* సైబర్‌ మోసగాళ్లు వీఐపీ నంబరు పేరిట టోకరా వేయడంతో.. విద్యుత్తు శాఖలో ఇంజినీరుగా పనిచేస్తున్న ముత్యం శ్రీకాంత్‌యాదవ్‌ రూ.28,500 పోగొట్టుకున్నారు.

* జిల్లాకేంద్రంలోని అబ్దుల్‌ వహీద్‌ బ్యాంకు ఖాతాలోంచి గుర్తుతెలియని వ్యక్తులు గత నెల 11 పర్యాయాల్లో రూ.50 వేలు కాజేశారు.

అప్రమత్తతోనే అడ్డుకట్ట

ప్రజలు ఆన్‌లైన్‌ పేమెంట్లలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వ పథకాల కోసం ఎవరైనా ఫోన్‌ చేస్తే ఎదుటి వ్యక్తి ఎవరో తెలియకుండా మాట్లాడరాదు. సంబంధిత కార్యాలయానికి వెళ్లి అధికారులను కలవాలి. ఏదైనా మోసం జరిగినట్లు గ్రహిస్తే వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి. - శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి

గత మూడేళ్లలో జిల్లాలో సైబర్‌ నేరాల కేసులు 

2020 : 171

2021 : 210

2022 (ఇప్పటివరకు) : 182 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని