Andhra News: నిద్రిస్తుండగానే యువతి సజీవ దహనం

నిద్రిస్తున్న మంచంపైనే ఓ యువతి సజీవ దహనమైన ఘటన తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. తణుకు గ్రామీణ సీఐ సీహెచ్‌ ఆంజనేయులు శనివారం తెలిపిన వివరాల మేరకు..

Updated : 13 Nov 2022 09:35 IST

అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు

హారిక (పాతచిత్రం)

తణుకు, తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే:  నిద్రిస్తున్న మంచంపైనే ఓ యువతి సజీవ దహనమైన ఘటన తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. తణుకు గ్రామీణ సీఐ సీహెచ్‌ ఆంజనేయులు శనివారం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్‌, గజ్జరపు వసంత దంపతుల కుమార్తె హారిక (19) బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. 2003లో వసంత మృతి చెందగా.. శ్రీనివాస్‌ 2009లో రూపను రెండో వివాహం చేసుకున్నారు. ఈమె కొంతకాలం వైకాపా తణుకు మండలం అధ్యక్షురాలిగా ఉన్నారు. కాగా పుట్టింటి నుంచి వసంతకు రావాల్సిన ఆస్తి కోసం శ్రీనివాస్‌ కొన్నాళ్ల కిందట కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హారిక మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. వీఆర్‌వో మహ్మద్‌మోహిద్దీన్‌ పాషా, గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా ప్రాంతాన్ని తణుకు గ్రామీణ సీఐతోపాటు ఎస్సై ఎం.రాజకుమార్‌లు పరిశీలించి వివరాలు సేకరించారు. అయితే చరవాణికి ఛార్జింగ్‌ పెడుతుండగా షార్టుసర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని హారిక తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామని, అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ ఆంజనేయులు చెప్పారు. ఇంతకాలం ఆస్తి కోసం ప్రేమగా నటించి.. తీర్పు తమకు అనుకూలంగా రాదనే ఉద్దేశంతో హారికను హత్య చేసి విద్యుత్తు షార్టుసర్క్యూట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె మేనమామ, అమ్మమ్మలు ఆరోపిస్తున్నారు. హారిక తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు