Narsipatnam: గాఢనిద్రలో ఊపిరాడక..

అర్ధరాత్రి రెండున్నర గంటల సమయం.. విద్యుత్తు సరఫరా నిలిచిపోయి చుట్టూ చిమ్మ చీకటి.. గదులన్నీ దట్టమైన వేడితో నల్లని పొగతో నిండిపోయాయి. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాం... ప్రాణం పోయేటట్టు ఉంది..

Updated : 21 Nov 2022 10:17 IST

విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో దట్టమైన పొగలు
సొమ్మసిల్లి తండ్రీకొడుకు మృతి
విశాఖలో చికిత్స పొందుతున్న తల్లీ కూతురు
అర్ధరాత్రి దాటిన తరువాత నర్సీపట్నంలో ఘటన
నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే

సుజాత, జాహ్నవి లహరి (ఈ తల్లీ కూతురు గాయపడి విశాఖలో కోలుకుంటున్నారు)

ర్ధరాత్రి రెండున్నర గంటల సమయం.. విద్యుత్తు సరఫరా నిలిచిపోయి చుట్టూ చిమ్మ చీకటి.. గదులన్నీ దట్టమైన వేడితో నల్లని పొగతో నిండిపోయాయి. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాం... ప్రాణం పోయేటట్టు ఉంది.. రక్షించమంటూ సోదరులిద్దరికీ కుటుంబ పెద్ద ఫోన్‌ .. అంతలోనే ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఊపిరాడక వారంతా సొమ్మ సిల్లిపోయారు. పొరుగునే ఉన్న అన్నదమ్ములు, చుట్టుపక్కల వారు వచ్చి గేటు తీయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. బయట ఉన్న వారంతా లోపలకు వెళ్లలేక నిస్సహాయంగా నిల్చొండిపోయారు. ఈ లోగా అగ్నిమాపక అధికారులు, సిబ్బంది వచ్చి గేటు తాళాన్ని విరగొట్టి స్థానికులతో కలిసి లోపలకు వెళ్లారు. కిటికీలు తెరిచి లోపల మంటలు ఆర్పడం మొదలు పెట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా మొదటి అంతస్తులో ఓ గది తెరిచారు. శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న జాహ్నవి లహరి (20)ని బయటకు మోసుకువచ్చి అంబులెన్స్‌లో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. లహరి ఇచ్చిన సమాచారంతో రెండో అంతస్తులో ఆమె తండ్రి నానాజీ (45), తల్లి సుజాత (37), తమ్ముడు మౌలిష్‌ ఆర్యన్‌ (19) ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి గది తలుపులు బలవంతంగా తెరిచి పరిస్థితి అంచనా వేశారు. శ్వాస ఆడుతున్నప్పటికి స్పృహ కోల్పోయిన సుజాతని తాళ్లసాయంతో కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆర్యన్‌, నానాజీలను తీసుకువచ్చి ఆసుపత్రికి పంపారు. వైద్యులు పరీక్షించి తండ్రీకొడుకు అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు. ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లీ కూతుళ్లను విశాఖపట్నం తరలించారు. అక్కడి ప్రైవేట్‌ ఆసుపత్రిలో వీరిద్దరు కోలుకుంటున్నారు.

పొగచూరిన గది పరిస్థితి...

సాయంత్రమే ఇంటికొచ్చిన కొడుకు

నానాజీ కుమారుడు విశాఖపట్నంలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో అమ్మానాన్న సోదరితో గడిపేందుకు శనివారం సాయంత్రం తరగతులు ముగిశాక విశాఖ నుంచి నర్సీపట్నం వచ్చాడు. కొడుకుని తమతో పాటే గదిలో నిద్రపొమ్మని తండ్రి సూచించడంతో ముగ్గురు ఒకే గదిలో ఉన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి దట్టమైన నల్లని వేడివాయువులు మింగేయడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కిటికీలు తెరిచేందుకు ప్రయత్నించడానికి వీల్లేని పరిస్థితి వారికి ఎదురైందని భావిస్తున్నారు. కనీసం కిటికీలు తెరిచినా వారికి ఊపిరి ఆడి ఉండేదని చెబుతున్నారు. తలుపులకు లోపల తాళాలు వేసుకుని నిద్రపోయారు. అగ్నిమాపక సిబ్బంది లోపలకు వెళ్లినప్పుడు ముగ్గురు మంచంపై కాకుండా కింద పడి ఉన్నారు. పొగకు శరీరాలు కొంత నల్లగా మారాయి. శరీరం ఉడికి పోవడంతో కొన్నిచోట్ల చర్మం ఊడొచ్చిన పరిస్థితిని గుర్తించి అందరూ ఆవేదన చెందారు.


సీపీఆర్‌ విధానంలో ప్రయత్నించినా...

నానాజీ అపస్మారక స్థితిని గుర్తించిన లీడింగ్‌ ఫైర్‌ మెన్‌ పరమేశ్వరరావు, సిబ్బంది కార్డియో పల్మనరీ రెసిస్టెంట్‌ (సీపీఆర్‌) విధానంలో కోలుకునేలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వేడిగా... విష వాయువుతో కూడిన దట్టమైన పొగ పీల్చడంతో ఇంట్లోని వారంతా స్పృహ కోల్పోయారు. షార్ట్‌ సర్క్యూట్‌ మొదటి అంతస్తు హాల్లో జరిగింది. క్షణాల్లో ఇంట్లో వైరింగ్‌ కాలిపోయింది. రెండు ఏసీలు, మంచాలు, పరుపులు, ఇన్వెర్టర్‌, ప్లాస్టిక్‌ తలుపులు, సీలింగ్‌ పూర్తిగా కాలిపోయాయి. లైట్లు టపటప మంటూ పేలిపోయాయి. ప్లాస్టిక్‌ వస్తువులు, వార్నిష్‌ గోడలు ఇలా అన్నీ కలిపి విషవాయువులై తండ్రీకొడుకుల ఊపిరి తీసుకున్నాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆస్తి నష్టం రూ. ఏడు లక్షల వరకు ఉంటుందని లీడింగ్‌ ఫైర్‌మెన్‌ తారకేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కావొచ్చని వివరించారు.


పరికరాలు ఉన్నట్లయితే...

నానాజీ సోదరుడు అప్పారావు నుంచి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చినప్పటికీ హైడ్రాలిక్‌ కట్టర్లు, డోర్‌ బ్రేకర్లు లేకపోవడంతో తాళాలు బద్దలు కొట్టేందుకు, తలుపులు తెరిచేందుకు స్థానికులతో కలిసి శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో చుట్టుపక్కల వారు సెల్‌ఫోన్ల టార్చ్‌లు వేసి వెలుగు చూపాల్సివచ్చింది. ఇన్‌ఛార్జి డీఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ నమ్మి గణేష్‌, ఎస్సై గోవిందరావులు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. నానాజీ సోదరుడు అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా భావిస్తున్నామని సీఐ విలేకరులకు తెలిపారు. నానాజీ విస్తృత పరిచయాలు కలిగిన వ్యక్తి కావడంతో ఘటన తెలియగానే బంధువులతో పాటు బంగారం వర్తకులు, విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు, వాకర్స్‌క్లబ్‌ సభ్యులు ఆయన ఇంటికి చేరుకున్నారు. శవపరీక్ష అనంతరం తండ్రీకొడుకుల మృతదేహాలను సాయంత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని