కలిసే మృత్యు ఒడికి

వారిద్దరి స్నేహాన్ని చూసి విధికీ కన్నుకుట్టింది. ఎక్కడికి వెళ్లినా నిత్యం కలిసే కనిపించే వీరు చివరకు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.

Updated : 24 Nov 2022 05:53 IST


కరీముల్లా, సద్దాం హుస్సేన్‌ (పాత చిత్రాలు)

మార్కాపురం, బేస్తవారపేట, న్యూస్‌టుడే: వారిద్దరి స్నేహాన్ని చూసి విధికీ కన్నుకుట్టింది. ఎక్కడికి వెళ్లినా నిత్యం కలిసే కనిపించే వీరు చివరకు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. బుధవారం రాత్రి మార్కాపురం మండలం తిప్పాయపాలెం శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్తవారపేట మెయిన్‌ బజారుకు చెందిన షేక్‌ కరీముల్లా (25), కంభం పట్టణానికి చెందిన పఠాన్‌ సద్దాం హుస్సేన్‌ (20) మిత్రులు. వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బుధవారం మధ్యాహ్నం వీరిద్దరూ మార్కాపురం పట్టణానికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి కంభం వెళ్తుండగా తిప్పాయపాలెం శివారు అమరావతి- అనంతపురం జాతీయ రహదారి మిట్టమీదపల్లె అడ్డరోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ ద్విచక్ర వాహనం పైనుంచి రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీఐ బీమానాయక్‌, మార్కాపురం గ్రామీణ ఎస్సై ఆర్‌.సుమన్‌, ఏఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిశీలించారు.


సంఘటనా స్థలంలో కారు

తల్లడిల్లిన కుటుంబాలు

బేస్తవారపేటకు చెందిన కరీముల్లా ఐటీఐ పూర్తిచేశాడు. తండ్రి బషీర్‌ ప్రధాన రహదారిపై పండ్ల దుకాణం నిర్వహిస్తుండగా ఆయనకు సహాయకారిగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. కరీముల్లాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. మరో మృతుడు హుస్సేన్‌  బేస్తవారపేటలో ఇళ్లకు అద్దాలు బిగించే దుకాణం నిర్వహిస్తున్నాడు. తల్లి, సోదరుడు, సోదరి ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మధ్యాహ్నం వరకు దుకాణాల్లో ఉన్న వీరు ఇలా విగతజీవులుగా కనిపించడాన్ని తట్టుకోలేకపోయారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని