పద్ధతి మారక.. చోరీలు మరువక

చోరీల బాట పట్టిన వారిద్దరూ డ్రైవర్లు.. ఒకరు రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మార్చుకోకుండా పోలీసులకు చిక్కాడు. మరొకరు కొవిడ్‌ కాలంలో వ్యసనాలకు బానిసై చరవాణులు చోరీ చేసి అరెస్టు అయ్యాడు.

Updated : 25 Nov 2022 04:57 IST

పోలీసులకు చిక్కిన ఇద్దరు
6.5 తులాల బంగారు ఆభరణాలు, 107 చరవాణులు స్వాధీనం


అశోక్‌, కృష్ణల నుంచి స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: చోరీల బాట పట్టిన వారిద్దరూ డ్రైవర్లు.. ఒకరు రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మార్చుకోకుండా పోలీసులకు చిక్కాడు. మరొకరు కొవిడ్‌ కాలంలో వ్యసనాలకు బానిసై చరవాణులు చోరీ చేసి అరెస్టు అయ్యాడు. వేర్వేరు ఘటనల్లో అరెస్ట్‌ అయిన వీరి నుంచి 6.5 తులాల బంగారు ఆభరణాలతో పాటు 92 చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు వివరాల ప్రకారం.. అల్వాల్‌లోని కౌకూర్‌కు చెందిన కారు డ్రైవర్‌ పరాంకుశం అశోక్‌ బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో రెండు ఇళ్లలో ఒకే రోజు చోరీలకు పాల్పడ్డాడు. 6.5 తులాల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేశాడు. బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు, తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి అశోక్‌ను అరెస్ట్‌ చేశారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాలకు డబ్బు చాలకపోవడంతో దొంగతనాలు ఎంచుకున్నాడని పోలీసులు వివరించారు. గతంలో నిరక్షరాస్యులైన మహిళల వద్దకు వెళ్లి పాన్‌, ఆధార్‌ కార్డులతోపాటు ఇతర ధ్రువీకరణపత్రాలు ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. ఓ మహిళ ఒంటరిగా ఉండటంతో ఆమె మంగళసూత్రం తెంచుకొని పరారయ్యాడు. జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్‌, చందానగర్‌ ఠాణాల పరిధిలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడి రెండోసారి పీడీ చట్టం కింద అరెస్ట్‌ అయ్యి తిరిగివచ్చాడు. తాజాగా మరోసారి పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై మొత్తం 11 కేసులు ఉన్నాయి.

* కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఎస్‌.కృష్ణ(34) ఆటోడ్రైవర్‌. అదే ప్రాంతానికి చెందిన షబ్బీర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వ్యసనాలకు బానిసయ్యారు. కరోనా వల కృష్ణ ఆర్థికంగా చితికిపోయాడు. చోరీలు చేయాలని కర్ణాటకలోని హుబ్లీకి వెళ్లాడు. అక్కడ కూరగాయల మార్కెట్‌, బస్టాండ్‌ల్లో చరవాణులు చోరీ చేసి కర్నూలుకు వచ్చేవాడు. షబ్బీర్‌ ద్వారా హైదరాబాద్‌లోని సమీకి విక్రయించేవాడు. తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడి చోరీల బాట పట్టాడు. బోయిన్‌పల్లి, కంచన్‌బాగ్‌, పహాడిషరీఫ్‌ ఠాణాల పరిధిలో దొంగతనాలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన తూర్పు మండల పోలీసులకు షబ్బీర్‌, సమి చిక్కారు. 15 చరవాణులు స్వాధీనం చేసుకొని కంచన్‌బాగ్‌ పోలీసులకు అప్పగించారు. కృష్ణను అరెస్టు చేసి 92 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు