‘మళ్లీ జన్మ ఉంటే మీ కొడుకుగానే పుడతాను’

‘ప్రియమైన అమ్మానాన్నలకు నేను ఇలా చేసుకోవడం తప్పే. కానీ తప్పడంలేదు. దయచేసి అర్థం చేసుకోగలరు.

Updated : 25 Nov 2022 11:49 IST

తల్లిదండ్రులు మాట్లాడుకోనందునే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి బలవన్మరణం

ఈశ్వరసాయి(పాత చిత్రం)

‘ప్రియమైన అమ్మానాన్నలకు నేను ఇలా చేసుకోవడం తప్పే. కానీ తప్పడంలేదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇప్పటికైనా ఇద్దరు కలిసి ఉండి మాట్లాడుకోండి. ఇదే నా చివరికోరిక అనుకోండి. నేను మీకు పుట్టడం నా అదృష్టం. కానీ మీకు అది దురదృష్టం. మళ్లీ జన్మ ఉంటే మీ కొడుకుగానే పుడతాను’ అని లేఖ రాసి  ఓ విద్యార్థి బలవన్మరణం పొందిన ఘటన వైయస్‌ఆర్‌ జిల్లా  ఇడుపులపాయలో చోటుచేసుకుంది.

వేంపల్లె, న్యూస్‌టుడే: ఉరవకొండకు చెందిన  వీరావతి, నాగభూషణం దంపతులకు ఈశ్వరి, ఈశ్వరసాయి ఇద్దరు పిల్లలు. నాగభూషణం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈశ్వరసాయి (17) ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు మాట్లాడుకోవడం లేదన్న మానసిక బాధతో గురువారం వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు హాస్టల్‌గదికి వచ్చి తలుపులు కొట్టగా తీయలేదు. అక్కడే ఉన్న సిబ్బందికి, విద్యార్థుల సంక్షేమ అధికారి ఇమ్రాంషరీఫ్‌కు సమాచారం అందించి గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఈశ్వరసాయి ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. 

విలపిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు

చదువులో టాపర్‌..: ఈశ్వరసాయి చదువులో టాపర్‌గా ఉన్నారు. పీయూసీ మొదటి సంవత్సరంలో 10కి 9.8 జీపీఏ సాధించారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ, కష్టపడి చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వేంపల్లె ఆసుపత్రికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డ సూసైడ్‌నోట్‌లో రాసిన మేరకు మా ఇద్దరి మధ్య విభేదాలు లేవని, మూడు నెలల నుంచి ఈశ్వరసాయి మానసిక ఒత్తిడికి గురువుతున్నారని, ఈ విషయాన్ని తోటి విద్యార్థులు మాకు ఫోన్‌చేసి చెప్పారని డైరెక్టర్‌ సంధ్యారాణికి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని