ప్రేయసితో వచ్చి.. చోరీలు చేసి

ఇళ్లల్లో చోరీలతో పాటు ద్విచక్ర వాహనాలు దొంగిలించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 26 Nov 2022 09:03 IST

వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటరావు

నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: ఇళ్లల్లో చోరీలతో పాటు ద్విచక్ర వాహనాలు దొంగిలించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సీఐ వెంకటరావు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్లేశ్వరం గ్రామానికి చెందిన కె.భాస్కరరావు అలియాస్‌ భాస్కర్‌ హైదరాబాద్‌లో కూలి పనులు చేసేవాడు. దత్తిరాజేరు గ్రామం నుంచి వలస వెళ్లిన ఓ వివాహిత అతనికి పరిచయమైంది. ఇద్దరూ కలిసి సహజీవనం సాగించారు. అనంతరం ఆమెతో కలిసి విజయనగరం వచ్చేశాడు. ఈక్రమంలో మద్యానికి బానిసకావడం, వింతగా ప్రవర్తిస్తుండడంతో అతడ్ని వదిలేసింది. దీంతో స్థానికంగా దొంగతనాలు చేస్తూ.. ఆ డబ్బులతో జల్సాలు చేయడం ఆరంభించాడు. నగరంలో మూడు చోట్ల, నెల్లిమర్ల మండలం బూరాడపేటలో పార్కింగ్‌ చేసిన నాలుగు వాహనాలను దొంగిలించాడు. తక్కువ ధరకే వాటిని విక్రయించడం, లేకుంటే పెట్రోల్‌ అయ్యే వరకూ తిరిగి ఎక్కడో ఓ చోట వదిలేసేవాడు. ఈనెల 15న కేఎల్‌.పురంలోని ఓ ఇంట్లోకి చొరబడి చెవిదిద్దులు, టీవీ ఎత్తుకుపోయాడు. శుక్రవారం వాహన తనిఖీలు చేస్తుండగా భాస్కర్‌ అనుమానాస్పదరీతిలో ప్రవర్తించడంతో విచారించగా నేరం ఒప్పుకొన్నాడని సీఐ తెలిపారు. అతడి నుంచి నాలుగు వాహనాలు, అరతులం బంగారం, ఓ టీవీను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించిన ఎస్సైలు భాస్కరరావు, అశోక్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అచ్చిరాజును ఆయన అభినందించారు.


మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

సాలూరు, న్యూస్‌టుడే: మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. సాలూరు పట్టణంలోని మెట్టు వీధికి చెందిన ఎస్‌కె.షాన్‌వాజ్‌(22) ఇంటి వద్దే తల్లిదండ్రులకు సాయంగా ఉండేవాడు. తండ్రి చాన్‌భాషా పారిశుద్ధ్య కార్మికుడు. తల్లి గృహిణి. నెల రోజుల కిందట వ్యక్తిగత కారణాలతో పురుగు మందు తాగి, ఆసుపత్రిలో చేరాడు. కోలుకున్నాక.. వారం కిందట పాము కాటుకు గురై ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. వాళ్ల పెదనాన్న ఇంట్లో వివాహం ఉండగా శుక్రవారం అంతా ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. ఈక్రమంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెబుతుండేవాడని స్నేహితులు తెలిపారు. పెళ్లి పూర్తయ్యాక, వీసా వస్తే విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. విజయగరం వెళ్తానంటే వద్దాన్నామని, వెళ్తే ప్రాణాలతో ఉండేవాడని తల్లిదండ్రులు ఏడ్చిన తీరు.. స్థానికుల కంటనీరు తెప్పించింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పాపారావు తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో వాలంటీరు మృతి

వరుణ్‌ (పాతచిత్రం)

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: మండలంలోని కేదారిపురంలో వాలంటీరుగా పనిచేస్తున్న తోయక వరుణ్‌(23) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. స్నేహితులతో కలిసి ఆయన గత ఆదివారం ఒడిశా ప్రాంతానికి పిక్నిక్‌కు వెళ్లారు. ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా తెండుగూడ సమీపంలో వాహనం బోల్తా పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలిచంగా అక్కడ మృతి చెందాడు. ఆదుకోవాల్సిన కుమారుడు మృత్యు ఒడికి చేరడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని