జల్సాలకు అలవాటు పడి వ్యాపారికి టోకరా

జల్సాలకు అలవాటు పడి అక్రమంగా డబ్బు సంపాదించాలన్న విద్యార్థి అత్యాశ అతడిని ఊచల వెనుకకు నెట్టేసిన సంఘటన ఆదిలాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది.

Updated : 27 Nov 2022 05:26 IST

జీఎస్టీ టాస్క్‌ఫోర్సు అధికారినంటూ బెదిరించి రూ.5 లక్షలు కాజేత

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, చిత్రంలో డీఎస్పీ వి.ఉమేందర్‌, గ్రామీణ సీఐ రఘుపతి

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : జల్సాలకు అలవాటు పడి అక్రమంగా డబ్బు సంపాదించాలన్న విద్యార్థి అత్యాశ అతడిని ఊచల వెనుకకు నెట్టేసిన సంఘటన ఆదిలాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. జీఎస్‌టీ, ఐటీ అధికారినంటూ వ్యాపారిని భయపట్టి రూ.5 లక్షలు కాజేశాడు. వివరాలను ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి శనివారం మావల పోలీసు స్టేషన్‌లో పాత్రికేయులకు వెల్లడించారు. ఉట్నూర్‌ మండలం ఎందా గ్రామానికి చెందిన శివకరణ్‌ కాగ్నే(22) పంజాబ్‌లోని జలంధర్‌ సైబర్‌ సెక్యూరిటీ, ఎల్‌పీయూ యూనివర్సిటిలో బీటెక్‌ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికొచ్చినపుడు స్థానిక వరసిద్ధి దుస్తుల దుకాణానికి తన సోదరితో కలిసి వెళ్లి.. ఆ దుకాణం యజమాని వివరాలు, చరవాణి నెంబరు సేకరించాడు. అతడికి ఫోన్‌ చేసి నేను జీఎస్‌టీ, ఐటీ అధికారినంటూ బెదిరించి ఆదిలాబాద్‌లోని ఒక లాడ్జికి రప్పించుకున్నాడు. వ్యాపారికి అక్కడికి రాగానే సుత్తితో తలపై కొట్టి తాడుతో కట్టేసి భయభ్రాంతులకు గురి చేశాడు. అనంతరం గత నెల 31న ఫోన్‌ చేసి కుటుంబ సభ్యులను హత్య చేస్తానని బెదిరించి అతని నుంచి రూ.5 లక్షలు తీసుకొని ఉడాయించాడు. ఈ విషయమై బాధితుడు ఈ నెల 1న మావల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ వి.ఉమేందర్‌ పర్యవేక్షణలో గ్రామీణ సీఐ రఘుపతి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకొని రూ.3.35 లక్షల నగదు, రూ.60 వేల విలువైన చరవాణి, సుత్తి, నైలాన్‌ తాడు, కత్తి, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసాలు ఇటీవల ఎక్కువయ్యాయని నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. డీఎస్పీ ఉమేందర్‌, గ్రామీణ సీఐ రఘుపతి, మావల ఎస్‌ఐ విష్ణువర్ధన్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు