గుప్తనిధుల పేరుతో మోసం

గుప్తనిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురిని గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

Updated : 28 Nov 2022 04:04 IST

నలుగురు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ గిరిప్రసాద్‌, చిత్రంలో సీఐలు

గోదావరిఖని, న్యూస్‌టుడే: గుప్తనిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురిని గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, ఇత్తడితో తయారు చేసిన రెండు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ గిరిప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన అప్పాల లక్ష్మణ్‌(39) ప్రస్తుతం గోదావరిఖనిలోని తన చిన్నమ్మ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ప్రజల్లో ఉన్న మూఢవిశ్వాసాలను ఆసరాగా చేసుకొని డబ్బు సంపాదించాడు. వచ్చే డబ్బులు సరిపోవడం లేదని సరికొత్త పథకం వేశాడు. తన చిన్నమ్మ కొడుకు లీలమ్‌ పాండురాజు(38), అతని మిత్రులు గంగారపు వినయ్‌కుమార్‌(35), వాసం రాజేశ్‌(35)లతో ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే గోదావరిఖనికి చెందిన తిరుపతి తన తండ్రి ఆరోగ్యం బాగలేదని లక్ష్మణ్‌ వద్దకు తీసుకువచ్చాడు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మబలికి వాటిని బయటకు తీసేందుకు రూ.8.5 లక్షలు వసూలు చేశారు. పూజలు చేసి ఇత్తడి విగ్రహాలు అందించగా మోసపోయినట్లు గుర్తించిన బాధితులు లక్ష్మణ్‌ ఇంటికి వెళ్లి నిలదీయడంతో బెదిరింపులకు దిగారు. అంతకు ముందు ఇదే విధంగా గోదావరిఖనికి చెందిన నీలారపు మహేందర్‌ను మోసం చేసి రూ.5 లక్షలు వసూలు చేశారు. గుప్తనిధుల పేరుతో మోసం చేస్తున్న ముఠాపై ఫిర్యాదులు రావడంతో నలుగురు నిందితులను సీఐ రమేశ్‌బాబు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ముఠా పలువురి నుంచి రూ.28.20 లక్షల వరకు వసూలు చేసినట్లు వివరించారు. వీరినుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన ఒకటో పట్టణ సీఐ రమేశ్‌బాబు, ప్రసాదరావు, ఎస్సై కె.రమేశ్‌, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. మూఢనమ్మకాలతో మోసపోవద్దని, మోసగాళ్లకు విలువైన వస్తువులు అప్పగించకూడదని ఏసీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని