చెరుకులపాడు హత్య కేసులో.. నిందితుడి ఆత్మహత్యాయత్నం

చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు నిందితుడు.. పోలీసుల అదుపులో ఉన్న తెదేపా వర్గీయుడు.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు మంగళవారం ఆత్మహత్యాయత్నం ఘటన సంచలనంగా మారింది.

Updated : 30 Nov 2022 05:18 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు నిందితుడు.. పోలీసుల అదుపులో ఉన్న తెదేపా వర్గీయుడు.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు మంగళవారం ఆత్మహత్యాయత్నం ఘటన సంచలనంగా మారింది. 2017, మే 21న కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం సమీపంలో చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచరుడు సాంబశివుడు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. నారాయణరెడ్డి అనుచరుడు గొల్ల కృష్ణమోహన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కృష్ణగిరి పోలీసులు చెరుకులపాడుకు చెందిన బీసన్నగారి రామాంజనేయులు (ఏ1), బోయకోతుల రామానాయుడు (ఏ2)తో సహా 19 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులను స్వగ్రామంలో ఉండేందుకు పోలీసులు అనుమతించకపోవటంతో వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఆర్థికంగా చితికిపోయిన వీరు తమ కుటుంబసభ్యులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. గత కొంతకాలంగా ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో ఉంటున్న రామాంజనేయులుపై మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. కృష్ణగిరి మండలం తొగిర్చేడులో ఉంటున్న బోయకోతుల రామానాయుడుపై ఆరు కేసులు నమోదయ్యాయి. పొలాలు సాగు చేసుకునేందుకు తనను స్వగ్రామంలోకి అనుమతించాలని రామాంజనేయులు మానవ హక్కుల కమిషన్‌ను సైతం ఆశ్రయించారు. వెల్దుర్తి పోలీసుస్టేషన్‌లో రామాంజనేయులు, బోయకోతుల రామానాయుడుపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు సన్నద్ధమయ్యారు. కల్లూరు మండలం చిన్నటేకూరులో ఉన్న తన అల్లుడు సురేంద్ర.. ఆంజనేయస్వామి మాల ధరించటంతో పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు రామాంజనేయులు మంగళవారం ఉదయం అక్కడికి వచ్చారు. ఇతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు చిన్నటేకూరు చేరుకుని పట్టుకున్నారు. అతను పోలీసుల నుంచి విడిపించుకుని వాహనం కింద దూరగా పట్టుకుని బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో ఎక్కించారు. అతని కుటుంబసభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామాంజనేయులును మొదట ఉలిందకొండ పోలీసుస్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి కర్నూలుకు తీసుకొచ్చారు. అతడిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా పోలీసులు అప్రమత్తంగా లేనిది చూసి క్రిమిసంహారక మందు తాగాడు. విషయం తెలిసిన అతని కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. రామాంజనేయులు అక్క రామాంజమ్మ మాట్లాడుతూ పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె బావ ప్రదీప్‌రెడ్డి తమపై కక్ష సాధింపు చర్యలకు    పాల్పడుతున్నారని చెప్పారు. ఏ   ఒక్క గ్రామంలో ఉండనీయకుండా పోలీసులు వేధిస్తున్నారన్నారు. నారాయణరెడ్డి సోదరుల కారణంగా తమ కుటుంబాల్లో ఎందరో తాళిబొట్లు    తెగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు