డామిట్‌.. జూదం కేసు అడ్డం తిరిగింది

అనుకున్నదొక్కటి.. అయినది మరొకటి. రూ.లక్షలపై ఆశతో ఇద్దరు ఎస్‌వోటీ కానిస్టేబుళ్లు నడిపిన చీకటి వ్యవహారం బెడిసికొట్టింది.

Updated : 01 Dec 2022 06:59 IST

చేతివాటం ప్రదర్శించిన ఎస్‌వోటీ కానిస్టేబుళ్లు?

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, గోల్కొండ, మాదాపూర్‌

నుకున్నదొక్కటి.. అయినది మరొకటి. రూ.లక్షలపై ఆశతో ఇద్దరు ఎస్‌వోటీ కానిస్టేబుళ్లు నడిపిన చీకటి వ్యవహారం బెడిసికొట్టింది. లక్ష్యం నెరవేరినా.. విషయం ఉన్నతాధికారులకు చేరటంతో వారిద్దరిపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల సరిహద్దుల్లో జరిగిన జూద స్థావరంపై ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల దాడి వెనుక దాగిన అసలు నిజం ఆలస్యంగా వెలుగుచూసింది.  

సరిహద్దు తెచ్చిన తంటా

సైబరాబాద్‌ పరిధిలోని ఇద్దరు ఎస్‌వోటీ కానిస్టేబుళ్లకు మసాజ్‌సెంటర్లు, స్నూకర్లు, జూద స్థావరాలు ఎక్కడున్నాయి.. ఎవరు నిర్వహిస్తారనే పక్కా సమాచారం ఉంటుంది. ఒకరికి జూద స్థావరాల నిర్వాహకుల నుంచి ప్రతి నెలా రూ.లక్ష మామూలు అందుతుందనే ఆరోపణలున్నాయి. ఇటీవల అతని బండారం బయటపడటంతో.. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ పోలీసు ఉన్నతాధికారి ఒకరు మందలించారు. తన విషయం బయటకు వచ్చేందుకు తోటి కానిస్టేబులే కారణమని భావించిన.. మామూళ్లు పుచ్చుకొనే కానిస్టేబుల్‌ మాదాపూర్‌లోని ఒక హోటల్‌లో నిర్వహించే జూద స్థావరాన్ని రాయదుర్గం సమీపంలోకి మార్చుకోమని నిర్వాహకులకు సూచించాడు. శనివారం వినాయక్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌస్‌కు శిబిరం మారింది. ఈ శిబిరంపై ఆ అవినీతి ఎస్‌వోటీ కానిస్టేబులే దాడి చేసి రాయదుర్గం బ్లూకోల్ట్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డు మాత్రమే సైబరాబాద్‌ కమిషనరేట్‌లోకి వస్తుందని.. జూదం ఆడుతున్న భవనం గోల్కొండ ఠాణా పరిధిలోనిదంటూ వెళ్లిపోయారు. ఆ కానిస్టేబుల్‌ నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం చేరవేసి జారుకున్నాడు.


రూ.25 లక్షలు ఏమైనట్టు?

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి 27 మంది జూదరులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. రూ.7.10 లక్షలు స్వాధీనం చేసుకొని గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఎస్‌వోటీ కానిస్టేబుల్‌, బ్లూకోల్ట్స్‌ పోలీసులు దాడి చేసినపుడు స్థావరంలో రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. సరిహద్దు విషయమై స్పష్టత వచ్చేలోగా సుమారు రూ.25 లక్షలు నగదు బయటకు తరలించినట్టు పట్టుబడిన నిందితుడొకరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. ఆ ఇద్దరు ఎస్‌వోటీ కానిస్టేబుళ్ల చేతివాటం, నిర్వాహకులతో అంటకాగుతున్న అంశాలు మంగళవారం సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్టు సమాచారం. వారిపైనా, వారికి సహరించిన పోలీసు అధికారులపై అంతర్గత విచారణకు ఆదేశించారు. స్పెషల్‌బ్రాంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు