క్రికెటర్‌ కాలేక దొంగయ్యాడు

క్రికెట్‌ అంటే ఇష్టం. కనీసం రంజీ క్రికెటర్‌గానైనా రాణించాలనుకున్నాడు. జట్టులోకి తీసుకోకుండా ఓ కోచ్‌ తనను మోసగించాడని లక్ష్యాన్ని పక్కనపెట్టి ఆన్‌లైన్‌లో బెట్టింగులకు దిగాడు.

Updated : 01 Dec 2022 06:59 IST

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: క్రికెట్‌ అంటే ఇష్టం. కనీసం రంజీ క్రికెటర్‌గానైనా రాణించాలనుకున్నాడు. జట్టులోకి తీసుకోకుండా ఓ కోచ్‌ తనను మోసగించాడని లక్ష్యాన్ని పక్కనపెట్టి ఆన్‌లైన్‌లో బెట్టింగులకు దిగాడు. రూ.లక్షల మేర అప్పులు చేసి, అవి తీర్చలేక దొంగగా మారాడు. చోరీల్లో ఆరితేరి రాష్ట్రంలో పలుచోట్ల దోపిడీలకు పాల్పడి పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవల జిల్లా కేంద్రం, ఎస్‌.కోట ప్రాంతాల్లో చోరీలు చేసి, పోలీసులకు చిక్కాడు. ఈ కేసు వివరాలను విజయనగరం ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, చీపురుపల్లి ఇన్‌ఛార్జి డీఎస్పీ మోహనరావు బుధవారం వెల్లడించారు. చీపురుపల్లి మండలం పత్తికాయవలసకు చెందిన వున్నాన రాంబాబు(28) బెట్టింగులకు పాల్పడి వ్యసనాలకు లోనయ్యాడు. చేసిన అప్పులు తీర్చేందుకు చోరీలకు పాల్పడేవాడు. ఎస్‌.కోట, విజయనగరం ఒకటో పట్టణం, జామి, రాజాం స్టేషన్లలో అతనిపై కేసులున్నాయి. ప్రత్యేక బృందాలు వెతకగా పత్తికాయవలస కూడలి వద్ద దొరికాడు. అతని నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోగా మరో 3 తులాలు రాబట్టాల్సి ఉందని, వాటిని ఇతరుల వద్ద కుదవ పెట్టాడని డీఎస్పీలు తెలిపారు.

పగటిపూట మాత్రమే.. నిందితుడు తాళాలు పగలుగొట్టడు. కానీ చోరీ చేస్తాడు. ఇంటి మనిషి మాదిరిగా పగటిపూట మాత్రమే వెళ్లి తన పని కానిచ్చేసి వెళ్లిపోతాడు. అలా అని దొరికినదంతా దోచుకోడు.. కొంత ఉంచేస్తాడు. ఇంట్లో వారి పనై ఉంటుందనే అనుమానాన్ని కలిగిస్తాడు. తాళాలు పగలగొట్టకుండా, కిటికీలు, గోడలు, ఇతరత్ర ప్రదేశాల్లో ఉంచే తాళం చెవులను వెతికి చోరీలకు పాల్పడతాడని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన ఎస్సైలు సన్యాసినాయుడు, జి.లోవరాజు, కానిస్టేబుళ్లు సీహెచ్‌.వైకుంఠరావు, వి.సూర్యనారాయణ, వి.శ్రీనివాసరావు, వి.వెంకటరమణను అభినందించారు. సీఐ బి.వెంకటరావు, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు