రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

పనికి వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం చిప్పలపల్లి శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

Updated : 01 Dec 2022 06:44 IST

పనికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: పనికి వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం చిప్పలపల్లి శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల కథనం మేరకు... ముస్తాబాద్‌ గ్రామానికి చెందిన సూర నవీన్‌ (22), ఒల్లెపు శ్రీనివాస్‌ (21) అనే ఇద్దరు యువకులు డ్రైవర్లు. బుధవారం  గంభీరావుపేట మండలం లింగన్నపేటలో పని ముగించుకొని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నారు. చిప్పపల్లి గ్రామ శివారులో ముస్తాబాద్‌ వైపు నుంచి ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాను డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బంధువులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

ఏడాదిలో ఇద్దరు...

సూర ఎల్లవ్వ-పాపయ్య దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. అవివాహితుడైన కుమారుడు నవీన్‌ (22) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిది కూలీ కుటుంబం. నవీన్‌ తండ్రి ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబానికి అండగా నిలిచిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి, చెల్లి, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఎదిగొచ్చిన కుమారుడి మృతితో...

ఒల్లెపు పద్మ-కనకయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అవివాహితుడైన చిన్న కుమారుడు శ్రీనివాస్‌ (21) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఎదిగొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని