నగల చోరీ నిందితుల అరెస్టు

బంగారు నగలు, నగదు దోచిన ఇద్దరు దొంగలను నేరవిభాగం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు.

Updated : 03 Dec 2022 04:54 IST

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : బంగారు నగలు, నగదు దోచిన ఇద్దరు దొంగలను నేరవిభాగం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. టింకరింగ్‌ షాపు నిర్వహించే పాతగుంటూరుకు చెందిన షేక్‌ అలీ, లారీ డ్రైవర్‌గా పనిచేసే బాలాజీనగర్‌కు చెందిన చిలకా రత్నరాజు ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో అక్టోబర్‌ 6న పాతగుంటూరులో ద్విచక్రవాహనం చోరీ చేశారు. అదే నెల 24న చౌడవరంలోని ఏటీఎం యంత్రాన్ని గ్యాస్‌ కట్టర్‌తో కోసి అందులో నగదు తస్కరించడానికి యత్నించగా బ్యాంకు అలారం మోగడంతో పారిపోయారు. నవంబర్‌ 20వ తేదీ రాత్రి లక్ష్మీపురంలో ఉన్న మహావీర్‌ జువెలరీపై వారి కన్నుపడింది. రోడ్డు మీద నుంచి లోపలకు ఉండటంతో చోరీ చేయడానికి సులువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. గ్యాస్‌ కట్టర్‌తో తాళాలు కోసి దుకాణం లోపల ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తస్కరించారు. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ మొత్తంలో బంగారం చోరీకి గురవ్వడంతో ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ప్రత్యేక దర్యాప్తునకు సీసీఎస్‌ పోలీసులను ఆదేశించారు. నేరవిభాగ ఏఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీలు ప్రకాష్‌బాబు, శ్రీనివాసరావు, సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి లోతుగా దర్యాప్తు చేపట్టారు. వేలిముద్రల విభాగ నిపుణులు ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా షేక్‌ అలీ, రత్నరాజులు నిందితులుగా నిర్ధరణకు వచ్చారు. చోరీ చేసి నగలు, నగదును బంధువుల ఇంట్లో పెట్టి విజయనగరం, రాజమండ్రి, మారేడుమిల్లిలో తలదాచుకున్నారు. చోరీ చేసిన సొత్తును పంచుకోవడానికి రైలులో గుంటూరుకు చేరుకోగా సమాచారం తెలుసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్‌ వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో 167 గ్రాముల బంగారం, రూ.6.35 లక్షల నగదు జప్తు చేసినట్లు తెలిపారు. చోరీకి గురైన సొత్తు, నగదు మరికొంత ఉండాలనే ఆరోపణలపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని