నడిరోడ్డుపై చితిమంటలు!

ఆ రెండు వాహనాలవి వేర్వేరు మార్గాలు, గమ్యాలు. జాతీయ రహదారి డివైడర్‌కు చెరో వైపున వెళ్తున్నాయి.

Updated : 03 Dec 2022 05:04 IST

లారీలు దగ్ధమై నలుగురు సజీవదహనం

ప్రమాద ఘటనను నమోదు చేసిన పెట్రోలు బంకులోని సీసీ కెమెరా

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ఆ రెండు వాహనాలవి వేర్వేరు మార్గాలు, గమ్యాలు. జాతీయ రహదారి డివైడర్‌కు చెరో వైపున వెళ్తున్నాయి. నడి రోడ్డుపై లావా ప్రవహించిన తీరుగా ఓ ప్రమాదం ఆ రెండు వాహనాలనూ ఉన్నపళంగా మండించింది. బతుకు పోరాటంలోని నలుగురు సగటు జీవులకు రహదారిపైనే చితిమంట పెట్టింది. రోడ్డు ప్రమాదాల తీరులో కొత్త కోణాన్ని చూపిస్తూ జరిగిన ఈ ఘోరం ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి పెను సంచలనమైంది. అయినవారికి కడచూపునకు నోచుకోని తీరుగా నలుగురి శరీరాలూ మంటల్లో అవశేషాలుగా మిగిలిపోయి చూపరులను కన్నీరు పెట్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని కోల్డు స్టోరేజీ నుంచి భీమవరం అశ్విని ఫిషరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు రొయ్యలను తీసుకెళ్తున్న కంటైనరును కడియం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఇసుకలారీ ఢీకొంది. రెండు వాహనాల క్యాబిన్‌లను మంటలు చుట్టుముట్టాయి. అందులోని వారు తప్పించుకొనే అవకాశమే లేకపోయింది. కంటైనరు చోదకుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్‌కుమార్‌ రాధేశ్యామ్‌ యాదవ్‌ (27), అందులో ఉన్న పశ్చిమగోదావరి జిల్లా యనమదుర్రుకు చెందిన ఫిషరీస్‌ సూపర్‌వైజర్‌ కాలి పెద్దిరాజు(45), ఇసుక లారీ చోదకుడు కృష్ణాజిల్లా కోడూరు మండలం పాదాలవారిపాలెం గ్రామానికి చెందిన జన్ను శ్రీను(45), ఇదే వాహనంలో మరో వివరాలు తెలియని వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో సమీపంలోని పెట్రోలు బంకులోని సిబ్బంది ఒక్కసారిగా ఏం జరిగిందోనని ఉలిక్కిపడ్డారు. అప్పటికపుడు సహాయ చర్యలకూ ఆస్కారం లేనంతగా రహదారిపై సెగలు ఆవహించాయి. సమాచారం అందుకున్న ఎస్సై సుధాకర్‌ బృందం ప్రత్తిపాడు, జగ్గంపేట అగ్నిమాపక యంత్రాంగం మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషిచేశారు. ఓ పక్క నిశీధి. హైవే మధ్యలో ఈ మంటలు.. అటూ ఇటూ వాహనాలను అదుపు చేస్తూనే సహాయ చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మంటలు అదుపు చేసినా అందులోని మనుషులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. చివరకు కాలిపోగా మిగిలిన మృతదేహాలే లభ్యమయ్యాయి. డ్రైవరు, క్లీనరు సీట్లలో దొరికిన ఈ అవశేషాలను బట్టి వివరాలు సేకరించినా.. డ్రైవరు కాకుండా ఇసుకలారీలో మరో వ్యక్తి ఎవరనేది తెలియరాలేదని ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

క్యాబిన్‌ దగ్ధమయ్యాక రొయ్యల కంటైనరు


ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉంటే..

రొయ్యల కంటైనరు హైవేపై ఓ చోట ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అలా అరగంట ఆలస్యం కాకుండా ఉంటే ప్రమాదానికి గురయ్యేది కాదని ఫిషరీస్‌ యంత్రాంగం ఒకరు అభిప్రాయపడ్డారు. చోదకుడు వినోద్‌తో పాటు కంటైనరులోని రొయ్యల శీతలస్థితిని ఎప్పటికపుడు పరిశీలించి కంపెనీకి నివేదించే పర్యవేక్షకుడు పెద్దిరాజు ఉన్నారు. భీమవరం నుంచి విశాఖ పోర్టుకు సరకు తెచ్చి. తిరిగివస్తూ అనకాపల్లిలోని కోల్డు స్టోరేజీ నుంచి రొయ్యలను తీసుకొస్తున్నారు. తెల్లారేలోపు గమ్యానికి చేరాల్సిన ఈ వాహనాన్ని అనుకోని తీరుగా ముప్పు..నిప్పుపెట్టిందని చెబుతున్నారు.


మిన్నంటిన రోదనలు..

ప్రమాదంలో నలుగురు సజీవ దహనంతో ఆ కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి. యనమదుర్రుకు చెందిన పెద్దిరాజు చాన్నాళ్లుగా ఫిషరీస్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. నలుగురు ఆడపిల్లల కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇద్దరి పెళ్లి, బాధ్యతలు పూర్తిచేశారు. అతడు లేని జీవితంలో ఇప్పుడు ఎలా కుటుంబ పోషణ అంటూ భార్య, బంధువులు, ప్రత్తిపాడు సీహెచ్‌సీవద్ద రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. గత నెల 30న విధులకు వెళ్లిన వ్యక్తి కడచూపూ మిగల్లేదని గగ్గోలు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్‌ భార్య, రెండేళ్ల చిన్నారితో భీమవరం వలసవచ్చారు. కంపెనీ వర్గాలు తప్ప అయినవారు రాలేని పరిస్థితి. ఇసుకలారీ చోదకుడు జన్ను శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి బాధ్యతను ఇప్పుడు ఎవరు చూస్తారని అతడి బంధువులు రోదిస్తున్నారు. కడచూపునకూ నోచుకోకుండా ప్రమాదం జరగడం విధి చిన్నచూపేనని వాపోయారు. ఇసుక లారీలో చోదకుడు కాకుండా మరో వ్యక్తి ఎవరనేది అంతుచిక్కలేదు. ఆచూకీ తెలిసే ఆనవాళ్లు లేవు.


ఆసుపత్రి వద్ద గంభీర వాతావరణం..

వాహనంలో డ్రైవరు, క్లీనరు సీట్లలో లభ్యమైన అవశేషాల ఆధారంగానే మృతదేహాలను పోలీసులు గుర్తించినా ఇసుక లారీలో చోదకుడు కాకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి వివరాలు తెలియలేదని ఎస్సై సుధాకర్‌ తెలిపారు. పెద్దాపురం డీఎస్పీ మురళీమోహన్‌  ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. ఎంవీఐ బి.శ్రీనివాస్‌ ప్రమాదాన్ని విశ్లేషించారు. సీఐ కిశోర్‌బాబు, ఎస్సైలు సుధాకర్‌, శోభన్‌కుమార్‌, ఫైర్‌ఆఫీసర్‌ రతన్‌రాజు, సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఇసుక లారీలో మృతులకు సంబంధించిన పంచనామా జరగాల్సి ఉంది.


దగ్ధమైన ఇసుకలారీ క్యాబిన్‌ వద్ద సీఐ కిశోర్‌బాబు, ఎస్సై సుధాకర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని