స్పిల్‌ ఛానల్‌లో పడవ బోల్తా

పడవ బోల్తాపడి ఇద్దరు గల్లంతు కాగా.. మరో ముగ్గురికి గాయాలైన ఘటన పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ ఛానల్‌లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

Updated : 05 Dec 2022 05:20 IST

ఇద్దరు మత్స్యకారుల గల్లంతు
ముగ్గురికి గాయాలు

కృష్ణమూర్తి  అప్పలస్వామి (పాతచిత్రాలు)

పోలవరం, న్యూస్‌టుడే: పడవ బోల్తాపడి ఇద్దరు గల్లంతు కాగా.. మరో ముగ్గురికి గాయాలైన ఘటన పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ ఛానల్‌లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలవరానికి చెందిన సూరిమిల్లి కృష్ణమూర్తి (30), వాటాల అప్పలస్వామి (25), పొన్నాడ పోసియ్య, వాటాల వీరబాబు, వాటాల సింహాచలం ఆదివారం మధ్యాహ్నం ఓ పడవలో ప్రాజెక్టు స్పిల్‌ ఛానల్‌లో చేపల వేటకు వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా పడవ ఇంజిన్‌ ఆగిపోయింది. ఈ క్రమంలో రాయిని ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది. కృష్ణమూర్తి, అప్పల స్వామి నీటిలో మునిగిపోయారు. మిగిలిన ముగ్గురిని సమీపంలోని మరో పడవలో ఉన్నవారు రక్షించారు. గల్లంతైన ఇద్దరి కోసం మత్స్యకారులు గాలించగా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు నిలిపివేశారు. ప్రమాదం నుంచి బయటపడిన వీరబాబుకు చేతి వేళ్లు తెగిపోయాయి. పొన్నాడ పోసియ్య స్పృహ తప్పి పడిపోయారు. సింహాచలానికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని పోలవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

మేనమామ, మేనల్లుడు.. ఈ ఘటనలో గల్లంతైన ఇద్దరూ మేనమామ, మేనల్లుడు, వీరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పలస్వామికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కృష్ణమూర్తి భార్య గర్భిణి. ఈయనకు కుమార్తె ఉన్నారు. అంతా చిన్నపిల్లలు కావడంతో ఆ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరదల సమయంలో ముంపు గ్రామాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా పడవలపై వెళ్లి రక్షించేవారని, అలాంటి వారు నీరు తక్కువగా ఉన్నప్పుడు గల్లంతు కావడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని