విద్యుదాఘాతంతో మహిళ మృతి

విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మేర్లపాక ఎస్సీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది.

Updated : 06 Dec 2022 04:47 IST

అనాథలైన ముగ్గురు పిల్లలు

భారతి (పాతచిత్రం)

మేర్లపాక (ఏర్పేడు): విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మేర్లపాక ఎస్సీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భారతి(43) ఇంటిపై దుస్తులు ఆరవేయడానికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అడ్డుగా ఉన్న ఓ కమ్మీని పక్కకు జరిపే క్రమంలో ఇంటి ముందు నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్తు తీగకు కమ్మి తగిలి విద్యుదాఘాతంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఐదేళ్ల కిందట భర్త చనిపోవడంతో గ్రామానికి సమీపంలోని పరిశ్రమలో రోజువారీ కూలీగా పని చేస్తూ ముగ్గురు కుమారులను పోషిస్తోంది. తల్లి మృతితో పిల్లలు అనాథలుగా మారారు. సంఘటన స్థలాన్ని విద్యుత్తుశాఖ అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.


రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

 

 

అల్లాబక్షు (పాతచిత్రం)

చిల్లకూరు: చిల్లకూరు మండలం పాలిచర్లవారిపాలెం సమీపాన సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. తిమ్మనగారిపాలెం చెందిన షేక్‌ అల్లాబక్షు (57) కూలీగా పనిచేసేవారు. గూడూరులో పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బయలుదేరిన అతను మధ్యలో పాలిచర్లవారిపాలెం గిరిజన కాలనీ వద్ద మరో వ్యక్తిని ఎక్కించుకున్నారు. కొంతదూరం రాగానే అదే మార్గంలో ఎదురుగా వచ్చిన కారు అదుపుతప్పి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఇద్దరూ రోడ్డుపై కింద పడిపోగా సుమారు 45 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి ఘటనాస్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన అల్లాబక్షు చికిత్స నిమిత్తం 108 వాహనంలో గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఎస్సై గోపాల్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని